Sreesanth and Sanju Samson Miss the Handshake: కేరళ క్రికెట్ లీగ్‌ 2026 ఫైనల్‌ ప్రజెంటేషన్‌ కార్యక్రమంలో చోటుచేసుకున్న ఓ చిన్న ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. కేరళకు చెందిన మాజీ క్రికెటర్ శ్రీశాంత్, స్టార్ క్రికెటర్ సంజూ శాంసన్‌ హ్యాండ్‌షేక్ చేసుకోకపోవడం చర్చకు దారితీసింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో.. ఇద్దరి మధ్య ఏమైనా విభేదాలు ఉన్నాయా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

ఫైనల్‌ అనంతరం జరిగిన ప్రజెంటేషన్‌ కార్యక్రమంలో సంజూ శాంసన్‌ అప్పటికే ట్రోఫీతో పాటు వేదికపై ఉన్నారు. ఆ సమయంలో శ్రీశాంత్‌ కూడా వేదికపైకి వచ్చారు. అక్కడ ఉన్న వారందరితో శ్రీశాంత్‌ చేతులు కలిపినప్పటికీ.. సంజూతో మాత్రం హ్యాండ్‌షేక్ చేయలేదు. సంజూ కూడా శ్రీశాంత్‌ వైపు నుంచి వచ్చిన ఈ సందర్భంలో చేతులు కలపలేదు. దీంతో ఇద్దరి మధ్య ఏం జరిగిందనే దానిపై సోషల్ మీడియాలో చర్చ మొదలైంది.

వీడియో వైరల్ కావడంతో అభిమానులు తమకు తోచిన కారణాలను సోషల్ మీడియాలో చెబుతున్నారు. ఇద్దరి మధ్య ఏదైనా మనస్పర్థలు ఉన్నాయా? అనే ఊహాగానాలు కూడా మొదలయ్యాయి. అయితే ఈ ఘటనపై సంజూ శాంసన్‌ లేదా శ్రీశాంత్‌ ఇప్పటివరకు అధికారికంగా ఎలాంటి స్పందన ఇవ్వలేదు. అసలు హ్యాండ్‌షేక్ ఎందుకు జరగలేదనే విషయం కూడా స్పష్టంగా తెలియలేదు.

ఇదిలా ఉంటే.. సంజూ శాంసన్‌ క్రికెట్ భవిష్యత్తుపై మాజీ భారత క్రికెటర్ వసీం జాఫర్ చేసిన వ్యాఖ్యలు కూడా ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి. 2027 వన్డే ప్రపంచకప్‌లో సంజూను బ్యాకప్ ఓపెనర్‌గా తాను చూడటం లేదని జాఫర్ స్పష్టం చేశారు. వన్డే క్రికెట్‌లో సంజూ నిలకడ సమస్యగా ఉందని, అతడిని టీ20 క్రికెట్‌కే పరిమితం చేయడం మంచిదని అభిప్రాయపడ్డారు.

దూరదర్శన్‌లో ప్రసారమైన ‘ది గ్రేట్ ఇండియన్ క్రికెట్ షో’లో మాట్లాడిన జాఫర్.. 2027 వన్డే ప్రపంచకప్‌కు భారత్‌ టాప్‌ ఆర్డర్‌ విషయంలో ఇప్పటి నుంచే కాంబినేషన్లను పరిశీలిస్తోందని చెప్పారు. వన్డేల్లో ఎక్కువ సమయం క్రీజులో ఉండాల్సి రావడంతో నిలకడ చాలా ముఖ్యమని అన్నారు. సంజూకు మ్యాచ్‌ విన్నింగ్‌ సామర్థ్యం ఉన్నప్పటికీ.. వన్డే ఫార్మాట్‌కు అవసరమైన స్థిరత్వం విషయంలో మరికొందరు ఆటగాళ్లు మెరుగైన ఎంపికలుగా కనిపిస్తున్నారని పేర్కొన్నారు.

“2027 వన్డే ప్రపంచకప్‌కు సంజూ శాంసన్‌ను బ్యాకప్ ఓపెనర్‌గా చూడటం లేదు. అతడి విషయంలో కొంత నిలకడ సమస్య ఉంది. వన్డేల్లో క్రీజులో ఎక్కువ సమయం ఉండాల్సి ఉంటుంది కాబట్టి స్థిరంగా ఆడటం చాలా ముఖ్యం. తన చివరి వన్డేలో సంజూ సెంచరీ చేసినప్పటికీ.. అతడు చాలా వన్డేలు ఆడాడు, కానీ నిలకడ సమస్యగా ఉంది. భారత్‌కు సంజూ కంటే కొన్ని మెరుగైన ఆప్షన్లు ఉన్నాయి. సంజూ టీ20 క్రికెట్‌ ఆడటంపైనే దృష్టి పెట్టడం మంచిదని నేను భావిస్తున్నాను” అని జాఫర్ వ్యాఖ్యానించారు.

ఒకవైపు శ్రీశాంత్‌-సంజూ హ్యాండ్‌షేక్ వీడియోపై సోషల్ మీడియాలో చర్చ జరుగుతుండగా.. మరోవైపు సంజూ వన్డే భవిష్యత్తుపై జాఫర్ చేసిన వ్యాఖ్యలు క్రికెట్ వర్గాల్లో ఆసక్తిని పెంచుతున్నాయి.

Tags: