Yashasvi Jaiswal: ఫెర్నాండోతో వాగ్వాదం.. యశస్వి జైస్వాల్ కు భారీ జరిమానా
భారీ జరిమానా
Yashasvi Jaiswal: క్రికెట్ మైదానంలో ఉత్కంఠ పోరులో ఒక్కోసారి ఆటగాళ్ల మధ్య భావోద్వేగాలు కట్టలు తెంచుకుంటాయి. తాజాగా భారత్, శ్రీలంక మధ్య జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్‌లోనూ ఇదే తరహా ఘటన చోటుచేసుకుంది. భారత యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్, లంక పేసర్ అసితా ఫెర్నాండోల మధ్య మైదానంలో జరిగిన తీవ్ర వాగ్వాదం ఇప్పుడు ఐసీసీ చర్యలకు దారితీసింది.
కొలంబో వేదికగా జరుగుతున్న రెండో టెస్ట్ తొలి రోజు ఆటలో ఈ నాటకీయ పరిణామం చోటుచేసుకుంది. లంక పేసర్ అసితా ఫెర్నాండో బౌలింగ్‌లో జైస్వాల్ వరుస బౌండరీలతో విరుచుకుపడ్డాడు. అయితే, అదే ఓవర్లో కోలుకున్న ఫెర్నాండో.. జైస్వాల్‌ను క్లీన్ బౌల్డ్ చేసి పెవిలియన్‌కు పంపాడు. వికెట్ తీసిన ఉత్సాహంలో అసితా ఫెర్నాండో దూకుడుగా సెండ్-ఆఫ్ ఇవ్వడంతో.. అసహనానికి గురైన జైస్వాల్ వెనక్కి తిరిగి అతన్ని ఎదుర్కొన్నాడు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది. ఆగ్రహంతో ఊగిపోయిన జైస్వాల్ హెల్మెట్.. నేరుగా ఫెర్నాండో నుదుటికి తగిలేలా ఇద్దరూ ఒకరికొకరు ఎదురుపడ్డారు. మైదానంలో ఉద్రిక్తత పెరగడంతో వెంటనే శ్రీలంక కెప్టెన్ ధనంజయ డి సిల్వా, ఆన్-ఫీల్డ్ అంపైర్లు జోక్యం చేసుకుని ఇద్దరినీ వేరుచేశారు.
ఈ ఘటనపై తీవ్రంగా స్పందించిన అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC).. ఐసీసీ ప్రవర్తనా నియమావళిలోని లెవల్-1 నిబంధనల ప్రకారం ఇద్దరు ఆటగాళ్లకూ శిక్ష ఖరారు చేసింది. ఆటగాళ్ల మధ్య అనుచిత శారీరక స్పర్శకు పాల్పడినట్లు తేలడంతో.. యశస్వి జైస్వాల్ మరియు అసితా ఫెర్నాండో ఇద్దరికీ వారి మ్యాచ్ ఫీజులో 25 శాతం జైర్మనా విధించడంతో పాటు, ఒక్కో డెమెరిట్ పాయింట్‌ను కూడా కేటాయించారు.
మ్యాచ్ ముగిసినంతరం స్పందించిన భారత బ్యాటింగ్ కోచ్ సీతాన్షు కొటక్.. ఇదంతా కేవలం 'హీట్ ఆఫ్ ది మూమెంట్'లో భావోద్వేగాల వల్లే జరిగిందని, అయినప్పటికీ జైస్వాల్ అంత దగ్గరికి వెళ్లకుండా ఉండాల్సిందని అభిప్రాయపడ్డారు. ఏదేమైనా, యువ ఆటగాడు జైస్వాల్ దూకుడు మైదానంలో మరోసారి పెద్ద చర్చకే తెరలేపింది.