Arshdeep Singh: ఇన్‌స్టాగ్రామ్‌లో 200కు పైగా పోస్టులు డిలీట్ చేసిన అర్ష్‌దీప్ సింగ్

పోస్టులు డిలీట్ చేసిన అర్ష్‌దీప్ సింగ్

Update: 2026-05-26 10:21 GMT

Arshdeep Singh: భారత లెఫ్ట్ ఆర్మ్ పేసర్ అర్ష్‌దీప్ సింగ్ ఈ మధ్య కాలంలో ఆట పరంగానే కాకుండా సోషల్ మీడియా వేదికగా కూడా నిరంతరం వార్తల్లో నిలుస్తున్నాడు. ఐపీఎల్ 2026 సీజన్ సందర్భంగా సహచర ఆటగాడు తిలక్ వర్మపై చేసిన కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు, మరో ప్లేయర్ ప్రియాంశ్ ఆర్యను ఆటపట్టించడం, నెట్టింట అభిమానులతో వాగ్వాదానికి దిగడం వంటి ఘటనలతో అతను తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నాడు. ఈ నేపథ్యంలో అర్ష్‌దీప్ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతా నుంచి మెజారిటీ పోస్టులను డిలీట్ చేయడం లేదా ఆర్కైవ్ చేయడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.

2025 ఛాంపియన్స్ ట్రోఫీ సమయంలో విరాట్ కోహ్లీతో కలిసి అతను చేసిన వైరల్ రీల్‌తో పాటు దాదాపు 200కు పైగా పోస్టులను అర్ష్‌దీప్ తొలగించాడు. ప్రస్తుతం అతని అధికారిక ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో కేవలం 44 పోస్టులు మాత్రమే కనిపిస్తున్నాయి. సెలబ్రిటీలు తమ సోషల్ మీడియా ప్రొఫైల్స్ క్లీన్ చేయడం సాధారణమే అయినప్పటికీ, గత కొన్ని వారాలుగా అర్ష్‌దీప్ ఎదుర్కొంటున్న ట్రోలింగ్ వల్లే ఈ నిర్ణయం తీసుకున్నాడనే ప్రచారం జరుగుతోంది. అయితే ఈ విషయంపై అర్ష్‌దీప్ కానీ, అతని టీమ్ కానీ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.

ఈ నెల ప్రారంభంలో అర్ష్‌దీప్ షేర్ చేసిన ఒక వీడియోలో, సహచర ఆటగాడు తిలక్ వర్మను సరదాగా ఆటపట్టిస్తూ 'అంధేరా' (చీకటి) అని పిలవడం తీవ్ర వివాదానికి దారితీసింది. అంతేకాకుండా సన్‌స్క్రీన్ రాసుకున్నావా అంటూ తిలక్‌ను ప్రశ్నిస్తూ, నమన్ ధీర్‌ను 'పంజాబ్ అసలు గ్లో' అని కామెంట్ చేయడంతో నెటిజన్లు అతనిపై ఫైర్ అయ్యారు. అర్ష్‌దీప్ వర్ణవివక్షతో కూడిన వ్యాఖ్యలు చేశాడంటూ సోషల్ మీడియాలో భారీగా విమర్శలు వచ్చాయి. ఈ వివాదంపై అటు అర్ష్‌దీప్ కానీ, ఇటు తిలక్ వర్మ కానీ ఇప్పటివరకు స్పందించలేదు.

Tags:    

Similar News