Board of Control for Cricket in India Fires: ఐపీఎల్ (IPL) 2026 సీజన్ మధ్యలో భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) ఊహించని విధంగా అత్యంత కఠినమైన నిర్ణయం తీసుకుంది. లీగ్ నిబంధనలు, ఆటగాళ్ల క్రమశిక్షణ, భద్రతా ప్రోటోకాల్స్‌ను ఉల్లంఘిస్తున్నారంటూ అన్ని ఐపీఎల్ జట్లు, ఫ్రాంచైజీ యాజమాన్యాలపై బోర్డు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ మేరకు బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా సంతకంతో కూడిన ఏడు పేజీల సుదీర్ఘ హెచ్చరికల లేఖను మొత్తం 10 ఫ్రాంచైజీలకు పంపింది.

ఈ సీజన్‌లో జరుగుతున్న వరుస నిబంధనల ఉల్లంఘనలు ఐపీఎల్ బ్రాండ్ ఇమేజ్‌తో పాటు, బీసీసీఐ ప్రతిష్టకు తీవ్ర భంగం కలిగిస్తున్నాయని బోర్డు ఆందోళన వ్యక్తం చేసింది. ఈ హెచ్చరికల్లో బీసీసీఐ ప్రధానంగా ప్రస్తావించిన అంశాలు ఇవే:

ఆటగాళ్లు, సపోర్ట్ స్టాఫ్ ప్రయాణించే హోటల్ గదుల్లోకి టీమ్ మేనేజర్ల అనుమతి లేకుండా అనధికారిక వ్యక్తులు ప్రవేశించడంపై బీసీసీఐ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. కనీసం యాంటీ కరప్షన్ యూనిట్ (ACU) అధికారులకు కూడా సమాచారం ఇవ్వకుండా చాలామంది తమ రూమ్‌లలోకి విజిటర్స్‌ను రప్పించుకుంటున్నట్లు బోర్డు గుర్తించింది.

"హై-ప్రొఫైల్ క్రీడా వాతావరణంలో ఆటగాళ్లను లక్ష్యంగా చేసుకుని బ్లాక్‌మెయిల్ చేయడం, హనీట్రాప్‌లకు గురిచేసే ప్రమాదం చాలా ఎక్కువగా ఉంది. అంతేకాకుండా లైంగిక వేధింపుల వంటి తీవ్రమైన చట్టపరమైన ఇబ్బందులు కూడా ఎదురయ్యే అవకాశం ఉంది" అని బీసీసీఐ హెచ్చరించింది.

ఇకపై కుటుంబ సభ్యులు, స్నేహితులు సహా ఎవరైనా సరే ఆటగాళ్ల రూమ్‌లోకి వెళ్లాలంటే టీమ్ మేనేజర్ రాతపూర్వక అనుమతి తప్పనిసరి అని స్పష్టం చేసింది. లేదంటే కేవలం హోటల్ లాబీల్లో మాత్రమే వారిని కలవాల్సి ఉంటుంది.

మ్యాచ్ జరుగుతున్న సమయంలో ఫ్రాంచైజీల యజమానులు ఆటగాళ్లను కలవడం, మాట్లాడటం లేదా వారిని కౌగిలించుకోవడం (Hugs) వంటి పనులు చేయడంపై బీసీసీఐ అసంతృప్తి వ్యక్తం చేసింది. మ్యాచ్ పూర్తయ్యే వరకు ఓనర్లు ఎవరూ కూడా డ్రెస్సింగ్ రూమ్, డగౌట్ లేదా ప్లేయింగ్ ఏరియా (PMOA) లోకి వెళ్లకూడదని కఠిన నిబంధన విధించింది. ఇలాంటి చర్యలు మ్యాచ్ గమనాన్ని ప్రభావితం చేసే అవకాశం ఉందని బోర్డు పేర్కొంది.

Tags: