Devdutt Padikkal:  భారత యువ బ్యాటర్ దేవదత్ పడిక్కల్ తృటిలో డబుల్ సెంచరీని చేజార్చుకున్నాడు. న్యూజిలాండ్ ఎ తో జరుగుతున్న అనధికారిక టెస్ట్ మ్యాచ్‌లో అద్భుతమైన ఇన్నింగ్స్‌తో చెలరేగిన పడిక్కల్.. కేవలం 1 పరుగు తేడాతో ద్విశతకాన్ని మిస్7 చేసుకున్నాడు. అయితే, అంపైర్ ఇచ్చిన వివాదాస్పద క్యాచ్ బిహైండ్ నిర్ణయంపై పడిక్కల్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు.

వికెట్ వద్ద అసలేం జరిగింది?

న్యూజిలాండ్ ‘ఎ’ బౌలర్ జాక్ గిబ్సన్ లెగ్ సైడ్ వైపు వేసిన బంతిని పడిక్కల్ ఫ్లిక్ చేసేందుకు ప్రయత్నించాడు. బంతి బ్యాట్‌కు తగలకుండా ప్యాడ్‌కు తగిలి నేరుగా వికెట్ కీపర్ గ్లౌవ్స్‌లోకి చేరింది. న్యూజిలాండ్ ఫీల్డర్లు కూడా బంతి ప్యాడ్‌కే తగిలిందని భావించడంతో అప్పీల్‌లో పెద్దగా పస కనిపించలేదు. కానీ ఆన్-ఫీల్డ్ అంపైర్ మాత్రం బంతి బ్యాట్ ఎడ్జ్ తీసుకుందని భావించి క్యాచ్ బిహైండ్‌గా ఔట్ ప్రకటించాడు.

అంపైర్ వేలు పైకెత్తడంతో పడిక్కల్ తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యాడు. బంతి బ్యాట్‌కు ఎంత దూరంలో ఉందో, కేవలం ప్యాడ్‌ను మాత్రమే తాకిందని సైగలతో చూపిస్తూ అసహనం వ్యక్తం చేశాడు. రివ్యూ అవకాశం లేకపోవడంతో తీవ్ర నిరాశతో క్రీజు వదిలి పెవిలియన్‌కు చేరాడు.

రికార్డు ఇన్నింగ్స్‌తో కదం తొక్కిన పడిక్కల్

ఔటైన విధానం నిరాశపరిచినప్పటికీ, జట్టు క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు పడిక్కల్ అసాధారణ పోరాట పటిమ కనబరిచాడు. మొత్తం 248 బంతులు ఎదుర్కొన్న పడిక్కల్.. 24 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 199 పరుగులు చేశాడు. ఈ ఇన్నింగ్స్‌తో ఇండియా ఎ జట్టు తరఫున అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించిన బ్యాటర్‌గా నిలవడమే కాకుండా, ఇండియా ఎ తరఫున 1000 పరుగుల మైలురాయిని కూడా చేరుకున్నాడు.

Tags: