MS Dhoni : ఐపీఎల్ 2027 వేలానికి ముందే ఎంఎస్ ధోనీ కీలక నిర్ణయం.. అభిమానులకు తల హింట్.. !
అభిమానులకు తల హింట్.. !
MS Dhoni : ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2027 సీజన్‌లో మహేంద్ర సింగ్ ధోనీ ఆడతాడా లేదా అనే ఉత్కంఠకు త్వరలోనే తెరపడనుంది. డిసెంబర్‌లో జరగనున్న ఐపీఎల్ వేలానికి ముందే తన నిర్ణయాన్ని స్పష్టం చేస్తానని ‘తల’ ధోనీ కీలక సంకేతాలు ఇచ్చాడు. వచ్చే సీజన్‌లో కొనసాగడంపై తన ఫిట్‌నెస్ మాత్రమే తుది నిర్ణయాన్ని నిర్దేశిస్తుందని 45 ఏళ్ల ధోనీ స్పష్టం చేశాడు. ఐపీఎల్ 2026 సీజన్‌లో ధోనీ పిక్క కండరాల సమస్య కారణంగా పూర్తి మ్యాచ్‌లు ఆడలేకపోయాడు. రాబోయే సీజన్‌లో బరిలోకి దిగే అంశంపై మాట్లాడిన ఆయన.. "మరో సీజన్ ఆడేందుకు నా శరీరం ఎంతవరకు సహకరిస్తుందో డిసెంబర్‌కు ముందే చూసుకోవాలి" అని పేర్కొన్నాడు. డిసెంబర్ మధ్యలో గోవా వేదికగా ఐపీఎల్ 2027 వేలం జరగనున్న నేపథ్యంలో, అంతకంటే ముందే తన భవిష్యత్ ప్రణాళికపై పూర్తి స్పష్టత రానుంది.
కీలక ఇన్నింగ్స్‌లు.. తిరుగులేని రికార్డులు
గత కొన్ని సీజన్లుగా చెన్నై సూపర్ కింగ్స్ బ్యాటింగ్ లైనప్‌లో ధోనీ చివరి ఓవర్లలోనే ఎక్కువగా బ్యాటింగ్‌కు వస్తున్నాడు. పరిమిత ఓవర్లే ఆడుతున్నప్పటికీ, తనదైన ట్రేడ్‌మార్క్ పవర్ హిట్టింగ్‌తో మెరుపులు మెరిపిస్తూ అభిమానులను అలరిస్తున్నాడు. ఐపీఎల్ చరిత్రలో అత్యుత్తమ రికార్డు నమోదు చేసిన ధోనీ.. ఇప్పటివరకు ఆడిన 278 మ్యాచ్‌లలో 24 అర్ధసెంచరీలతో 5,439 పరుగులు సాధించాడు. అత్యంత విజయవంతమైన కెప్టెన్‌గా సీఎస్‌కేకు 5 ఐపీఎల్ ట్రోఫీలు, 2 ఛాంపియన్స్ లీగ్ టీ20 టైటిళ్లను అందించాడు. డిసెంబర్ వేలానికి ముందే ధోనీ తన తుది నిర్ణయాన్ని ప్రకటించనుండటంతో, అభిమానులతో పాటు సీఎస్‌కే యాజమాన్యం కూడా ఆయన నిర్ణయంపై ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోంది.