Jadeja’s Emotional Post: నిన్ను చూస్తే గర్వంగా ఉంది .. జడేజా ఎమోషనల్ పోస్ట్

జడేజా ఎమోషనల్ పోస్ట్

Update: 2025-10-18 04:51 GMT

Jadeja’s Emotional Post: టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా సతీమణి, జామ్‌నగర్ నార్త్ ఎమ్మెల్యే రివాబా జడేజా గుజరాత్ రాష్ట్ర మంత్రివర్గంలో చోటు దక్కించుకున్నారు. ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ నేతృత్వంలో శుక్రవారం (అక్టోబర్ 17, 2025) గాంధీనగర్‌లో కొలువుదీరిన నూతన కేబినెట్‌లో ఆమె సహాయ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన రివాబా జడేజాకు మంత్రి పదవి లభించడం ఆమె రాజకీయ జీవితంలో ఒక ముఖ్యమైన మైలురాయిగా నిలిచింది. ఈ సందర్భంగా రవీంద్ర జడేజా తన సతీమణిని అభినందిస్తూ సోషల్ మీడియాలో ఎమోషనల్ పోస్ట్ పెట్టారు. రవీంద్ర జడేజా తన అధికారిక సోషల్ మీడియా ఖాతాలో రివాబా జడేజా ప్రమాణ స్వీకారం చేస్తున్న ఫోటోను పంచుకుంటూ, ఆమెపై తన ఆనందాన్ని, గర్వాన్ని వ్యక్తం చేశారు. "నిన్ను చూస్తే చాలా గర్వంగా ఉంది. గుజరాత్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినందుకు అభినందనలు. ఈ కొత్త బాధ్యతతో మరింత మంది ప్రజలకు సేవ చేస్తావని, ప్రజోపయోగకరమైన పనుల ద్వారా భవిష్యత్‌లో మరిన్ని గొప్ప విజయాలు సాధిస్తావని ఆశిస్తున్నాను. నీ ప్రయాణం కోసం నా శుభాకాంక్షలు. జై హింద్!" అని జడేజా రాసుకొచ్చారు. రివాబా జడేజా 2019 మార్చిలో భారతీయ జనతా పార్టీ (BJP)లో చేరారు. 2022 గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో జామ్‌నగర్ నార్త్ నుంచి పోటీ చేసి, తన ప్రత్యర్థిపై 50,000లకు పైగా భారీ మెజార్టీతో విజయం సాధించారు. ఆమె మెకానికల్ ఇంజినీరింగ్‌లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. 2016 ఏప్రిల్ 17న రవీంద్ర జడేజాను వివాహం చేసుకున్నారు. బీజేపీలో చేరడానికి ముందు ఆమె రాజ్‌పుత్ వర్గానికి చెందిన కర్ణిసేన మహిళా విభాగానికి చీఫ్‌గా కూడా పనిచేశారు. రివాబా జడేజా మంత్రివర్గంలోకి రావడం గుజరాత్ ప్రభుత్వంలో యువ, మహిళా ప్రాతినిధ్యానికి ప్రాధాన్యత ఇవ్వడాన్ని సూచిస్తోంది. తన భార్య రాజకీయ విజయానికి జడేజా తన మద్దతును ఎప్పుడూ ఇస్తూ వచ్చారు. ఎన్నికల ప్రచారంలో కూడా ఆయన చురుగ్గా పాల్గొని రివాబా తరపున ప్రచారం నిర్వహించారు.

Tags:    

Similar News