Harmanpreet Kaur: మూడు ఫార్మాట్లలో కెప్టెన్సీకి హర్మన్‌ప్రీత్ కౌర్ గుడ్‌బై
గుడ్‌బై
Harmanpreet Kaur: భారత మహిళల క్రికెట్ జట్టు కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. మూడు ఫార్మాట్లలోనూ టీమ్‌ఇండియా కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్లు మంగళవారం ప్రకటించారు. ఇన్నేళ్లుగా జట్టుకు నాయకత్వం వహించిన తాను ఇప్పుడు తన బాధ్యతను పూర్తి చేశానని.. ఇకపై ఆటను ఇష్టంతో ఆస్వాదిస్తూ ఆడేందుకు సిద్ధంగా ఉన్నానని చెప్పారు.
ఇటీవల గువాహటిలో బీసీసీఐ సమీక్ష సమావేశం నిర్వహించింది. గత కొన్ని నెలల్లో భారత మహిళల జట్టు ప్రదర్శనపై ఈ సమావేశంలో చర్చించారు. బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశానికి హర్మన్‌ప్రీత్ కౌర్, వైస్ కెప్టెన్ స్మృతి మంధాన, హెడ్ కోచ్ అమోల్ ముజుందార్ హాజరయ్యారు. ఈ సమావేశం తర్వాతే హర్మన్‌ప్రీత్ తన నిర్ణయాన్ని ప్రకటించారు.
2016లో హర్మన్‌ప్రీత్ టీ20 జట్టు కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టారు. దాదాపు పదేళ్ల పాటు ఆమె టీ20 జట్టుకు నాయకత్వం వహించారు. 2022లో వన్డే జట్టు కెప్టెన్‌గా బాధ్యతలు అందుకున్నారు. ఆ తర్వాత 2023 నుంచి మూడు ఫార్మాట్లకు కెప్టెన్‌గా కొనసాగారు.
కెప్టెన్సీ నుంచి తప్పుకుంటున్న విషయాన్ని హర్మన్‌ప్రీత్ సోషల్ మీడియాలో వెల్లడించారు. ఈ నిర్ణయం తీసుకోవడం అంత సులభం కాదని ఆమె చెప్పారు. కెప్టెన్‌గా ఉన్న సమయంలో ఎన్నో జ్ఞాపకాలు, భావోద్వేగాలు, త్యాగాలు, కష్టాలు తనతో ఎప్పటికీ ఉంటాయని పేర్కొన్నారు.
భారత జట్టు కోసం, మహిళల క్రికెట్ కోసం తన శక్తి మేరకు అన్నీ చేశానని హర్మన్‌ప్రీత్ తెలిపారు. తన సమయం, కష్టం, శ్రమతో పాటు కొన్నిసార్లు తన వ్యక్తిగత ఆట, ఆశలను కూడా జట్టు కోసం పక్కన పెట్టానని చెప్పారు.
గతేడాది నవంబర్‌లో భారత్‌కు తొలిసారి వన్డే ప్రపంచకప్ అందించిన జట్టుకు హర్మన్‌ప్రీత్ నాయకత్వం వహించారు. అలాగే టీ20 ఫార్మాట్‌లో వరుసగా రెండోసారి ఆసియా క్రీడల స్వర్ణ పతకం సాధించిన భారత జట్టుకు కూడా ఆమె కెప్టెన్‌గా ఉన్నారు. ఇలాంటి విజయాల మధ్య కెప్టెన్సీకి వీడ్కోలు పలుకుతున్న ఆమె.. ఎన్నో భావోద్వేగాలతో పాటు మనసులో ప్రశాంతతతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు.
భారత్ తరఫున హర్మన్‌ప్రీత్ మొత్తం ఐదు టెస్టులు, 51 వన్డేలు, 155 టీ20 మ్యాచ్‌లకు కెప్టెన్‌గా వ్యవహరించారు. అయితే ఈ ఏడాది జరిగిన టీ20 ప్రపంచకప్‌లో భారత జట్టు సెమీఫైనల్‌కు చేరుకోలేకపోవడంతో ఆమెపై విమర్శలు పెరిగాయి. మరోవైపు టీ20ల్లో స్మృతి మంధాన కూడా ఆశించిన స్థాయిలో పరుగులు చేయకపోవడంతో జట్టు ప్రదర్శనపై చర్చ జరిగింది.
హర్మన్‌ప్రీత్ స్థానంలో స్మృతి మంధానకు కెప్టెన్సీ అప్పగించాలనే డిమాండ్లు కూడా గతంలో వినిపించాయి. మాజీ క్రికెటర్ డయానా ఎడుల్జీ వంటి వారు కూడా మంధానకు అవకాశం ఇవ్వాలని సూచించారు. హర్మన్‌ప్రీత్ అందుబాటులో లేని సమయంలో చాలాసార్లు మంధానే జట్టుకు నాయకత్వం వహించారు. దీంతో ఇప్పుడు భారత మహిళల జట్టుకు కొత్త కెప్టెన్ ఎవరనే దానిపై ఆసక్తి నెలకొంది.