Sourav Ganguly: ఐపీఎల్‌ 2027 సీజన్‌కు ముందు ఢిల్లీ క్యాపిటల్స్‌ కీలక నిర్ణయం తీసుకుంది. భారత మాజీ కెప్టెన్‌, దిగ్గజ క్రికెటర్‌ సౌరవ్ గంగూలీని జట్టు హెడ్‌ కోచ్‌గా నియమించింది. గతంలో ఢిల్లీ క్యాపిటల్స్‌తో కలిసి పనిచేసిన గంగూలీ.. ఇప్పుడు కోచ్‌గా కొత్త బాధ్యతలు చేపట్టనున్నారు. ఇప్పటివరకు హెడ్‌ కోచ్‌గా ఉన్న మాజీ భారత క్రికెటర్‌ హెమంగ్‌ బదానీ స్థానంలో గంగూలీ వచ్చారు.

ఢిల్లీ క్యాపిటల్స్‌ జట్టుతో గంగూలీకి ఇప్పటికే మంచి అనుబంధం ఉంది. గతంలో ఆయన ఆ జట్టుకు క్రికెట్‌ డైరెక్టర్‌గా కూడా పనిచేశారు. పురుషుల జట్టుతో పాటు మహిళల జట్టు క్రికెట్‌ వ్యవహారాల్లోనూ కీలక బాధ్యతలు నిర్వహించారు. దీంతో జట్టు ఆటగాళ్లు, సిబ్బంది, యాజమాన్యంతో గంగూలీకి మంచి పరిచయం ఉంది.

హెడ్‌ కోచ్‌గా బాధ్యతలు చేపట్టడంపై గంగూలీ మాట్లాడుతూ.. ఢిల్లీ క్యాపిటల్స్‌తో తనకు చాలా ఏళ్లుగా మంచి అనుబంధం ఉందని చెప్పారు. జట్టులో మంచి ప్రతిభ ఉన్న ఆటగాళ్లు ఉన్నారని, వారితో కలిసి పనిచేయడం కోసం ఎదురుచూస్తున్నానని తెలిపారు. కొత్త సీజన్‌లో బలమైన, భయపడకుండా ఆడే జట్టును తయారు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు.

2025 ఐపీఎల్‌కు ముందు హెమంగ్‌ బదానీని ఢిల్లీ క్యాపిటల్స్‌ హెడ్‌ కోచ్‌గా నియమించింది. అంతకుముందు వరుసగా మూడు సీజన్లలో ఢిల్లీ జట్టు ప్లేఆఫ్స్‌కు చేరుకోలేకపోవడంతో బదానీకి బాధ్యతలు అప్పగించారు. అదే సమయంలో అక్షర్‌ పటేల్‌ను కొత్త కెప్టెన్‌గా నియమించారు.

అయితే బదానీ వచ్చిన తర్వాత కూడా ఢిల్లీ క్యాపిటల్స్‌ పరిస్థితిలో పెద్దగా మార్పు కనిపించలేదు. 2025, 2026 సీజన్లలోనూ ఆ జట్టు ప్లేఆఫ్స్‌కు చేరుకోలేకపోయింది. దీంతో బదానీని కోచ్‌ పదవి నుంచి తప్పించి.. ఆయన స్థానంలో గంగూలీని నియమించారు.

గంగూలీ నియామకంపై ఢిల్లీ క్యాపిటల్స్‌ చైర్మన్‌, సహ యజమాని పార్థ్‌ జిందాల్‌ సంతోషం వ్యక్తం చేశారు. గంగూలీ ఎప్పటినుంచో ఢిల్లీ క్యాపిటల్స్‌ కుటుంబంలో కీలక భాగంగా ఉన్నారని చెప్పారు. భారత క్రికెట్‌లో గొప్ప కెప్టెన్లలో ఒకరైన గంగూలీ ఇప్పుడు కోచ్‌గా బాధ్యతలు చేపట్టడం గర్వంగా ఉందన్నారు. ఆయన నాయకత్వంలో జట్టు ఐపీఎల్‌ టైటిల్‌ కోసం మరింత బలంగా సిద్ధమవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

ఢిల్లీ క్యాపిటల్స్‌ మరో సహ యజమాని కిరణ్‌ కుమార్‌ గ్రంధి కూడా గంగూలీపై ప్రశంసలు కురిపించారు. ఢిల్లీ క్యాపిటల్స్‌ ప్రయాణంలో గంగూలీకి ఇప్పటికే ఎంతో అనుభవం ఉందని చెప్పారు. జట్టు క్రికెట్‌ వ్యవస్థను బలోపేతం చేయడంలో ఆయన కీలకంగా పనిచేశారని తెలిపారు. గంగూలీకి ఉన్న క్రికెట్‌ పరిజ్ఞానం, నాయకత్వ అనుభవం జట్టుకు ఎంతో ఉపయోగపడుతుందని పేర్కొన్నారు.

మొత్తంగా ఐపీఎల్‌ 2027కు ముందు ఢిల్లీ క్యాపిటల్స్‌లో కీలక మార్పు చోటుచేసుకుంది. ఆటగాడిగా, కెప్టెన్‌గా, పరిపాలకుడిగా ఎంతో అనుభవం ఉన్న సౌరవ్‌ గంగూలీ ఇప్పుడు కోచ్‌గా ఎలాంటి మార్పులు తీసుకొస్తారనేది ఆసక్తికరంగా మారింది.

Tags: