Prasidh Krishna: న్యూజిలాండ్ పర్యటనకు సంబంధించి భారత జట్టును బీసీసీఐ ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. అయితే జట్టు ప్రకటనకు ముందే ఎంపికపై పలు ఆసక్తికర వార్తలు వెలువడుతున్నాయి. ప్రధానంగా ఇటీవల గాయపడిన ఫాస్ట్ బౌలర్ ప్రసిద్ధ్ కృష్ణ న్యూజిలాండ్ విమానం ఎక్కే అవకాశాలు బలంగా ఉన్నట్లు సమాచారం. వెస్టిండీస్‌తో జరిగిన రెండో వన్డే మ్యాచ్‌లో ప్రసిద్ధ్ కృష్ణ తొడ కండరాల గాయానికి గురయ్యాడు. ఆ మ్యాచ్‌లో అతను కేవలం 5 ఓవర్లు మాత్రమే బౌలింగ్ చేసి మైదానాన్ని వీడాల్సి వచ్చింది.

అనంతరం న్యూ చండీగఢ్‌లో జరిగిన మూడో వన్డేకు కూడా దూరమయ్యాడు. అయితే, క్రిక్‌బజ్ నివేదిక ప్రకారం అతని గాయం అంత తీవ్రమైనది కాదని ప్రాథమికంగా తేలింది. దీంతో ఆక్లాండ్‌కు వెళ్లే భారత జట్టులో ప్రసిద్ధ్ కృష్ణకు స్థానం దక్కే వీలుంది. కాకపోతే, బెంగళూరులోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (CoE) నుంచి ఫిట్‌నెస్ క్లియరెన్స్ లభించిన తర్వాతే సెలెక్టర్లు అతని పేరును అధికారికంగా ఖరారు చేయనున్నారు.

రేసులో ముఖేష్ కుమార్, ఆకాశ్‌దీప్

ప్రసిద్ధ్ కృష్ణతో పాటు బెంగాల్ ఫాస్ట్ బౌలర్లు ముఖేష్ కుమార్, ఆకాశ్‌దీప్ కూడా జట్టు ఎంపిక రేసులో ముందువరుసలో ఉన్నారు. ముఖేష్ కుమార్ ఇటీవల ముగిసిన ఇరానీ కప్‌లో రెస్ట్ ఆఫ్ ఇండియా తరఫున రెండో ఇన్నింగ్స్‌లో 6 వికెట్లు తీసి అద్భుత ప్రదర్శన చేశాడు. 2023లో వెస్టిండీస్‌పై టెస్ట్ అరంగేట్రం చేసిన ముఖేష్, తాజా ఫామ్‌తో టెస్ట్ జట్టులోకి పునరాగమనం చేయడానికి బలమైన పోటీదారుగా మారాడు. ఆకాశ్‌‌దీప్ దేశవాళీ, అంతర్జాతీయ స్థాయి ప్రదర్శనల ఆధారంగా ఆకాశ్‌దీప్ పేరును కూడా సెలెక్టర్లు తీవ్రంగా పరిశీలిస్తున్నారు.

పర్యటన వివరాలు

టీమిండియా న్యూజిలాండ్ పర్యటన అక్టోబర్ 22న ప్రారంభం కానుంది. ఇందుకోసం భారత జట్టు అక్టోబర్ మధ్యలోనే బయలుదేరనుంది. ఈ సుదీర్ఘ పర్యటనలో భాగంగా భారత్, న్యూజిలాండ్ జట్లు 5 టీ20లు, 5 వన్డేలు, 2 టెస్ట్ మ్యాచ్‌లలో తలపడనున్నాయి. త్వరలోనే సెలెక్షన్ కమిటీ పూర్తిస్థాయి జట్టును ప్రకటించే అవకాశం ఉంది.

Tags: