Harshit Rana: టీమ్ ఇండియాలోకి హర్షిత్ రాణా రీ ఎంట్రీ!

హర్షిత్ రాణా రీ ఎంట్రీ!

Update: 2026-06-19 06:31 GMT

Harshit Rana: యువ ఫాస్ట్ బౌలర్ హర్షిత్ రాణా సుదీర్ఘ విరామం తర్వాత మళ్లీ భారత వన్డే జట్టులోకి ఎంపికయ్యాడు. అఫ్గానిస్తాన్‌తో జరుగుతున్న మూడు మ్యాచ్‌ల ద్వైపాక్షిక సిరీస్‌లో భాగంగా శనివారం చెన్నై వేదికగా జరగబోయే చివరి వన్డే కోసం ఆయనను జట్టులోకి తీసుకుంటున్నట్లు బీసీసీఐ అధికారికంగా ప్రకటించింది. ఇప్పటికే ఈ సిరీస్‌లో మొదటి రెండు వన్డేలు గెలిచిన భారత్ 2-0 తేడాతో తిరుగులేని ఆధిక్యంలో ఉంది. కాగా, ఈ ఏడాది జనవరిలో న్యూజిలాండ్‌తో జరిగిన టీ20 సిరీస్ తర్వాత హర్షిత్ రాణా మళ్లీ అంతర్జాతీయ మ్యాచ్ ఆడేందుకు సిద్ధమయ్యాడు.

ఇటీవల జరిగిన టీ20 ప్రపంచకప్ 2026 టోర్నీకి ముందు ముంబైలో దక్షిణాఫ్రికాతో జరిగిన వార్మప్ మ్యాచ్‌లో హర్షిత్ రాణా మోకాలి గాయానికి గురయ్యాడు. ఈ గాయం కారణంగా ఆయన ఆ మెగా టోర్నమెంట్‌ మొత్తానికి దూరం కావాల్సి వచ్చింది. ఆ సమయంలో రాణా స్థానంలో చివరి నిమిషంలో జట్టులోకి వచ్చిన మహమ్మద్ సిరాజ్, అమెరికాపై జరిగిన మ్యాచ్‌లో 3 వికెట్లు తీసి రాణించాడు. కాగా, ఈ ప్రపంచకప్ ఫైనల్లో న్యూజిలాండ్‌ను ఓడించి భారత్ విజేతగా నిలిచింది. ఈ మోకాలి గాయం తీవ్రత వల్ల హర్షిత్ రాణా ఐపీఎల్ 2026 సీజన్‌కు కూడా పూర్తిగా దూరమయ్యాడు. కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు ఆయన స్థానంలో నవదీప్ సైనీని రీప్లేస్‌మెంట్‌గా తీసుకుంది.

గాయం నుండి కోలుకోవడానికి బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (COE)లో చేరిన హర్షిత్ రాణా, తాజాగా తన పునరావాస ప్రక్రియను (రిహాబిలిటేషన్) విజయవంతంగా పూర్తి చేసుకున్నాడు. ఈ నేపథ్యంలోనే ఆయన చెన్నైలో ఉన్న భారత వన్డే జట్టుతో చేరినట్లు బీసీసీఐ శుక్రవారం ఉదయం వెల్లడించింది. 24 ఏళ్ల హర్షిత్ రాణా ఇప్పటివరకు భారత్ తరఫున 14 వన్డేలు ఆడి 16 వికెట్లు పడగొట్టాడు. రాబోయే ఐర్లాండ్, ఇంగ్లాండ్ పర్యటనల్లో జరగబోయే 7 టీ20ల సిరీస్‌కు కూడా రాణాను ఎంపిక చేసినట్లు బోర్డు స్పష్టం చేసింది.

Tags:    

Similar News