Irfan Pathan: క్రికెట్ మైదానంలో ఆటగాళ్ల మధ్య మాటల యుద్ధాలు జరగడం సాధారణమే. కానీ, కొన్నిసార్లు ఈ స్లెడ్జింగ్ హద్దులు దాటి వ్యక్తిగత దూషణలకు దారితీస్తుంది. తాజాగా టీమిండియా మాజీ ఆల్ రౌండర్ ఇర్ఫాన్ పఠాన్.. శ్రీలంక దిగ్గజం కుమార సంగక్కరతో జరిగిన ఒకానొక తీవ్ర వాగ్వాదాన్ని గుర్తు చేసుకుంటూ ఆసక్తికర విషయాలను బయటపెట్టారు.

2005లో ఢిల్లీలోని ఫిరోజ్ షా కోట్లా వేదికగా భారత్-శ్రీలంక మధ్య టెస్ట్ మ్యాచ్ జరిగింది. ఆ మ్యాచ్‌లో వీరేంద్ర సెహ్వాగ్ గాయపడటంతో, ఇర్ఫాన్ పఠాన్‌ను ఓపెనర్‌గా పంపించారు. అయితే, అంతకుముందు శ్రీలంక బ్యాటింగ్ చేస్తున్న సమయంలో బాల్ మార్పు వివాదంపై లంక ఆటగాళ్లు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. దీనికి సంగక్కర ప్రధానంగా గళం విప్పారు.

ఈ వివాదం గురించి ఏమాత్రం తెలియని ఇర్ఫాన్ పఠాన్ క్రీజులోకి వచ్చి శ్రీలంక స్పిన్ లెజెండ్ ముత్తయ్య మురళీధరన్ బౌలింగ్‌లో అద్భుతమైన సిక్సర్లు బాదారు. దీంతో శ్రీలంక ప్రణాళికలు తలకిందులయ్యాయి. తీవ్ర నిరాశకు గురైన సంగక్కర.. వికెట్ల వెనకాల నుంచి పఠాన్‌ను వ్యక్తిగతంగా దూషించడం మొదలుపెట్టారు. "మీరు చీటర్స్.. మీ తల్లిదండ్రులు మీకు నేర్పింది ఇదేనా?" అంటూ కుటుంబాలపై కామెంట్లు చేశారట. ఇర్ఫాన్ పఠాన్ కూడా ఏమాత్రం వెనక్కి తగ్గకుండా అదే స్థాయిలో గట్టిగా బదులిచ్చారు. ఆ మ్యాచ్‌లో పఠాన్ తృటిలో సెంచరీ కోల్పోయి 93 పరుగులు చేశారు.

అయితే, మైదానంలో నిప్పులు చెరిగిన ఈ వైరం కాలక్రమేణా మితృత్వంగా మారింది. ఐపీఎల్ తొలి సీజన్ 2008లో కింగ్స్ XI పంజాబ్ జట్టు తరఫున ఇద్దరూ కలిసి ఆడాల్సి వచ్చింది. ఆ సమయంలో ఇర్ఫాన్ పఠాన్ స్వయంగా ముందుకు వెళ్లి సంగక్కరకు సారీ చెప్పారు. సంగక్కర కూడా తన తప్పును అంగీకరించి క్షమాపణ కోరడంతో గతం మర్చిపోయి మంచి స్నేహితులుగా మారినట్లు పఠాన్ తాజాగా వెల్లడించారు.

Tags: