Sourav Ganguly: భారత మాజీ క్రికెట్ లెజెండ్, దిగ్గజ కెప్టెన్ సౌరవ్ గంగూలీకి వరుసగా ప్రాణాపాయ బెదిరింపులు రావడం కలకలం రేపింది. తనను, తన భార్య డోనాను చంపేస్తామని హెచ్చరిస్తూ కొద్దికాలంగా బెదిరింపు లేఖలు వస్తుండటంతో గంగూలీ పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు.

పీటీఐ వార్తా సంస్థ వెల్లడించిన వివరాల ప్రకారం.. సౌరవ్ గంగూలీ చేసిన రాతపూర్వక ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు వేగవంతం చేశారు.

ఈ ఫిర్యాదును చాలా సీరియస్‌గా తీసుకున్నామని, దర్యాప్తు ప్రారంభించామని ఒక సీనియర్ పోలీసు అధికారి తెలిపారు. ఆ లేఖలు ఎక్కడి నుంచి వచ్చాయి, వాటి మూలాలు ఏంటి, ఏ కొరియర్ సర్వీస్ ద్వారా పంపారు అనే కోణంలో ఆరా తీస్తున్నట్లు చెప్పారు.

ప్రస్తుతం బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ (సీఏబీ) అధ్యక్షుడిగా ఉన్న గంగూలీ.. సోమవారం తన కార్యాలయానికి మరో లేఖ రావడంతో దక్షిణ కోల్‌కతాలోని ఠాకూర్‌పుకుర్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి స్వయంగా ఫిర్యాదు చేసినట్లు ఆ అధికారి తెలిపారు.

గత ఆరు నెలలుగా బీసీసీఐ మాజీ అధ్యక్షుడు గంగూలీ పేరిట ఇలాంటి బెదిరింపు లేఖలు వస్తున్నప్పటికీ.. మొదట్లో వాటిని అంతగా పట్టించుకోలేదని తెలిసింది.

అయితే సోమవారం గంగూలీ కార్యాలయానికి రెండు లేఖలు అందాయని, అందులో ఆయనను, ఆయన భార్యను చంపేస్తామని, ఆయనకు సన్నిహితులైన వారికి హాని తలపెడతామని స్పష్టమైన హెచ్చరికలు ఉన్నాయని మాజీ క్రికెటర్ మేనేజర్ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు.

ఆ లేఖల్లో ఏముంది? పంపిన వ్యక్తి ఎవరూ, అతని ఉద్దేశం ఏంటనే కోణంలో పోలీసులు లోతుగా విచారణ జరుపుతున్నారు.

ప్రాథమిక విచారణ ప్రకారం.. ఉత్తర 24 పరగణాల జిల్లాలోని బేల్ఘరియా ప్రాంతానికి చెందిన వ్యక్తి ఈ లేఖలను కొరియర్ ద్వారా పంపినట్లు అనుమానిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

నిందితుడు ఉపయోగించినట్లు భావిస్తున్న సిమ్ కార్డు కదలికలపై నిఘా పెట్టామని, కొరియర్ ఏజెన్సీని సంప్రదించి ఆ పార్శిళ్లకు సంబంధించిన పూర్తి వివరాలు సేకరిస్తున్నామని చెప్పారు.

కొరియర్ సర్వీస్ సిబ్బందితో మాట్లాడి ఒక మొబైల్ నంబర్‌ను గుర్తించామని, దాని ఆధారంగా నిందితుడిని పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నామని ఆ అధికారి వెల్లడించారు.

ఇప్పటివరకు వచ్చిన లేఖలన్నీ ఒకే వ్యక్తి పంపాడా? లేక దీని వెనుక వేరే కారణాలు ఏమైనా ఉన్నాయా? అనే కోణంలో కోల్‌కతా పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.

Tags: