ICC Imposes Fine on Team India: టీమిండియాకు జరిమానా విధించిన ఐసీసీ

జరిమానా విధించిన ఐసీసీ

Update: 2025-12-08 15:21 GMT

ICC Imposes Fine on Team India: దక్షిణాఫ్రికాతో జరిగిన ఉత్కంఠభరితమైన వన్డే సిరీస్‌ను భారత్ 2-1 తేడాతో కైవసం చేసుకుంది. అయితే ఈ సిరీస్‌ విజయం ఒకవైపు సంతోషాన్ని ఇవ్వగా మరోవైపు స్లో ఓవర్‌రేట్ కారణంగా జట్టుకు జరిమానా పడటం చర్చనీయాంశమైంది. రాయ్‌పూర్‌లో జరిగిన రెండో వన్డేలో కెఎల్ రాహుల్ నేతృత్వంలోని భారత జట్టు నిర్ణీత సమయంలో వేయాల్సిన ఓవర్ల కంటే రెండు ఓవర్లు తక్కువగా వేసినట్లు ఐసీసీ మ్యాచ్ రిఫరీ రిచీ రిచర్డ్‌సన్ నిర్ధారించారు. దీంతో ఐసీసీ ప్రవర్తనా నియమావళి ఆర్టికల్ 2.22 ప్రకారం, ఆటగాళ్ల మ్యాచ్ ఫీజులో 10 శాతం కోత విధిస్తున్నట్లు అంతర్జాతీయ క్రికెట్ మండలి ప్రకటించింది. కెప్టెన్ రాహుల్ జరిమానాను అంగీకరించడంతో తదుపరి విచారణ అవసరం రాలేదు. కాగా ఆ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ (102), రుతురాజ్ గైక్వాడ్ (105) సెంచరీలు చేసినప్పటికీ దక్షిణాఫ్రికా 4 వికెట్ల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే.

భారత్ అద్భుత విజయం

మూడోదైన చివరి వన్డే విశాఖపట్నంలో జరిగింది. ఈ మ్యాచ్‌లో భారత్ అద్భుత ప్రదర్శనతో విజయం సాధించి సిరీస్‌ను సొంతం చేసుకుంది. యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ (116 నాటౌట్) తన తొలి వన్డే శతకాన్ని నమోదు చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. కెప్టెన్ రోహిత్ శర్మ (75), విరాట్ కోహ్లీ (65 నాటౌట్) అర్ధ సెంచరీలతో రాణించారు. దీంతో 271 పరుగుల లక్ష్యాన్ని భారత్ కేవలం ఒక వికెట్ కోల్పోయి 39.5 ఓవర్లలోనే ఛేదించింది. ఈ విజయంతో మూడు వన్డేల సిరీస్‌ను భారత్ 2-1 తేడాతో సొంతం చేసుకుంది. టెస్టు సిరీస్‌లో 0-2తో ఓటమి తర్వాత ఈ గెలుపు జట్టుకు గొప్ప ఊరటనిచ్చింది. అంతేకాకుండా, స్వదేశంలో భారత్‌కు ఇది వరుసగా 10వ వన్డే సిరీస్ విజయం కావడం విశేషం.

Tags:    

Similar News