Sehwag’s Massive Statement: వైభవ్ కోసం రూ.30 కోట్లు పెడతా: సెహ్వాగ్

సెహ్వాగ్

Update: 2026-05-29 04:06 GMT

Sehwag’s Massive Statement: ఐపీఎల్‌లో ఒకే ఒక్క ఇన్నింగ్స్‌తో యావత్ క్రికెట్ ప్రపంచం తన వైపు చూసేలా చేశాడు రాజస్థాన్ రాయల్స్ యువ ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ. సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో జరిగిన చావో రేవో తేల్చుకోవాల్సిన ఎలిమినేటర్ మ్యాచ్‌లో.. ఈ యువ సంచలనం సృష్టించిన విధ్వంసం అంతా ఇంతా కాదు. హైదరాబాద్ బౌలర్లను ఫోర్లు, సిక్సర్లతో చెడుగుడు ఆడుకుంటూ కేవలం 29 బంతుల్లోనే 5 ఫోర్లు, ఏకంగా 12 సిక్స్‌లతో 97 పరుగులు రాబట్టాడు. జస్ట్ 3 పరుగుల దూరంలో సెంచరీ మిస్ అయినప్పటికీ.. అతను ఆడిన ఈ ఇన్నింగ్స్ ఐపీఎల్ చరిత్రలోనే ఒక మైలురాయిగా నిలిచిపోతుంది.

ఈ నయా సంచలనం కేవలం మ్యాచ్‌ను మాత్రమే గెలిపించలేదు.. ఏకంగా యూనివర్స్ బాస్ క్రిస్ గేల్ పేరిట ఉన్న ఆల్‌టైమ్ రికార్డును బద్దలు కొట్టాడు. ఒకే ఐపీఎల్ సీజన్‌లో అత్యధిక సిక్సర్లు బాదిన ఆటగాడిగా ఇప్పటివరకు క్రిస్ గేల్ 59 సిక్సర్లతో టాప్‌లో ఉండేవాడు. కానీ, వైభవ్ సూర్యవంశీ తన సిక్సర్ల సునామీతో ఏకంగా 65 సిక్సర్లు బాది.. గేల్ రికార్డును తుడిచేసి, కొత్త చరిత్ర సృష్టించాడు.

ఈ అద్భుత ఇన్నింగ్స్ చూసిన మాజీ ఆటగాళ్లు వైభవ్‌పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఎలిమినేటర్ మ్యాచ్ సందర్భంగా కామెంటరీ బాక్స్‌లో వీరేంద్ర సెహ్వాగ్, హర్భజన్ సింగ్ మధ్య ఆసక్తికరమైన చర్చ నడిచింది. ఒకవేళ సూర్యవంశీ మళ్లీ వేలంలోకి వస్తే ఎంత డబ్బు చెల్లిస్తావ్?" అని భజ్జీ అడగ్గా.. సెహ్వాగ్ ఏ మాత్రం ఆలోచించకుండా.. "తాను రూ. 30 కోట్లు అయినా పెట్టి కొంటాను" అంటూ వైభవ్ రేంజ్‌ను ఆకాశానికి ఎత్తేశాడు.

మరోవైపు ఐపీఎల్ ఛైర్మన్ అరుణ్ ధుమాల్ సైతం వైభవ్ టాలెంట్‌కు ఫిదా అయిపోయారు. వైభవ్‌లో 'స్పెషల్ టాలెంట్' ఉందని ఆయన కొనియాడారు. ఈ కుర్రాడు మరింత రాటుదేలడానికి బీసీసీఐ, రాజస్థాన్ రాయల్స్ ఫ్రాంఛైజీ పూర్తి మార్గదర్శకత్వం అందిస్తాయని స్పష్టం చేశారు. క్రీడల్లో కేవలం శారీరక దృఢత్వమే కాదు, మానసిక దృఢత్వం (టెంపర్‌మెంట్) కూడా చాలా ముఖ్యమని.. అతను రాబోయే మరెన్నో సంవత్సరాల పాటు టీమ్ ఇండియా తరపున మెరిసేలా బీసీసీఐ తన వంతు కృషి చేస్తుందని అరుణ్ ధుమాల్ హామీ ఇచ్చారు.

Tags:    

Similar News