India Dominates ICC ODI Rankings: ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో భారత్ ఆధిపత్యం: రోహిత్ నెం.1, కోహ్లీ నెం.2!

భారత్ ఆధిపత్యం: రోహిత్ నెం.1, కోహ్లీ నెం.2!

Update: 2025-12-11 03:34 GMT

India Dominates ICC ODI Rankings: భారత క్రికెట్ దిగ్గజాలు, బ్యాటింగ్ స్టార్స్ అయిన రోహిత్ శర్మ,విరాట్ కోహ్లీ అద్భుతమైన ఫామ్‌ను కొనసాగిస్తూ తాజాగా విడుదలైన ఐసీసీ వన్డే బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో తొలి రెండు స్థానాలను కైవసం చేసుకున్నారు. రోహిత్ శర్మ తన అగ్రస్థానాన్ని నిలబెట్టుకోగా, కోహ్లీ రెండు స్థానాలు ఎగబాకి ప్రపంచ నెం.2 ర్యాంకును సొంతం చేసుకున్నాడు. వీరిద్దరి మధ్య వ్యత్యాసం కేవలం 8 రేటింగ్ పాయింట్లు మాత్రమే ఉండటంతో, అగ్రస్థానం కోసం పోరు మరింత రసవత్తరంగా మారింది. వన్‌డే ఫార్మాట్‌లో తమ భవిష్యత్తుపై తీవ్ర ఊహాగానాలు నెలకొన్నప్పటికీ, ఈ ఇద్దరు దిగ్గజాలు తాము ఎందుకు గొప్ప ఆటగాళ్ళో నిరూపించారు. అంతర్జాతీయ క్రికెట్‌లోకి తిరిగి వచ్చిన రోహిత్ శర్మ ఆస్ట్రేలియాపై మూడు వన్డేల సిరీస్‌లో 101 సగటుతో ఏకంగా 202 పరుగులు చేసి ‘ప్లేయర్ ఆఫ్ ది సిరీస్’ అవార్డును గెలుచుకున్నాడు. స్వదేశంలో దక్షిణాఫ్రికాపై జరిగిన వన్డే సిరీస్‌లో కూడా తన ఫామ్‌ను కొనసాగిస్తూ 146 పరుగులు జోడించుకున్నాడు. మరోవైపు, కింగ్ కోహ్లీ అద్భుత ప్రదర్శన చేశాడు. ఆస్ట్రేలియా పర్యటనలో రెండు డక్‌లు చేసినా, చివరి మ్యాచ్‌లో అజేయంగా 74 పరుగులు చేసి ఫామ్‌లోకి వచ్చాడు. అనంతరం దక్షిణాఫ్రికాతో జరిగిన మూడు వన్డేల సిరీస్‌లో వరుసగా రెండు సెంచరీలు, ఒక అజేయ అర్ధ సెంచరీతో చెలరేగిపోయాడు. ఈ సిరీస్‌లో కోహ్లీ 151 సగటుతో 302 పరుగులు చేసి, 'ప్లేయర్ ఆఫ్ ది సిరీస్' అవార్డును దక్కించుకున్నాడు. కోహ్లీ 2021లో చివరిసారిగా నెం.1 స్థానంలో ఉన్నాడు. టాప్ 10 ర్యాంకింగ్స్‌లో భారత బ్యాటర్లు తమ స్థానాలను పదిలం చేసుకున్నారు. ఇటీవల గాయం కారణంగా దక్షిణాఫ్రికా సిరీస్‌కు దూరమైన శుభ్‌మన్ గిల్ 5వ స్థానంలో కొనసాగుతున్నాడు. మరోవైపు, కేఎల్ రాహుల్ రెండు స్థానాలు మెరుగుపరుచుకుని 12వ స్థానానికి చేరుకోగా, గాయంతో కోలుకుంటున్న శ్రేయస్ అయ్యర్ టాప్ 10 నుంచి 11వ స్థానానికి పడిపోయాడు. బ్యాటర్ల ర్యాంకింగ్స్‌లోనే కాక, బౌలర్ల జాబితాలో కూడా భారత్‌కు చెందిన కుల్దీప్ యాదవ్ భారీగా ర్యాంకును మెరుగుపరుచుకున్నాడు. దక్షిణాఫ్రికాతో మూడు మ్యాచ్‌ల్లో 20.78 సగటుతో 9 వికెట్లు తీసిన కుల్దీప్, ఏకంగా మూడు స్థానాలు ఎగబాకి ప్రపంచంలోనే మూడో అత్యుత్తమ వన్డే బౌలర్‌గా నిలిచాడు. అతడి కంటే ముందు రషీద్ ఖాన్, జోఫ్రా ఆర్చర్ మాత్రమే ఉన్నారు.

Tags:    

Similar News