India Eye Series Win: సిరీస్ విజయంపై టీమిండియా కన్ను.. అఫ్గాన్‌తో రెండో వన్డేకు రోహిత్ సేన రెడీ!

అఫ్గాన్‌తో రెండో వన్డేకు రోహిత్ సేన రెడీ!

Update: 2026-06-17 04:04 GMT

India Eye Series Win: అఫ్గానిస్తాన్‌తో రెండో వన్డే సమరానికి టీమిండియా సర్వం సిద్ధమైంది. ఇవాళ జరిగే ఈ కీలక పోరులో గెలిచి, వన్డే సిరీస్‌ను కైవసం చేసుకోవడమే లక్ష్యంగా బరిలోకి దిగుతోంది. అయితే కేవలం సిరీస్ గెలవడమే కాదు.. వచ్చే ఏడాది జరిగే వన్డే వరల్డ్ కప్‌ను దృష్టిలో పెట్టుకుని టీమ్ మేనేజ్‌మెంట్ కొన్ని వినూత్న ప్రయోగాలకు తెరలేపాలని చూస్తోంది.

ఈ క్రమంలోనే తుది జట్టులో చైనామెన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్‌తో పాటు యంగ్ సెన్సేషన్ యశస్వి జైస్వాల్‌కు చోటు దక్కుతుందా? లేదా? అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. వరల్డ్ కప్‌కు ముందు ఆడే వన్డేల సంఖ్య చాలా తక్కువగా ఉండటంతో.. దొరికిన ప్రతి అవకాశాన్ని ప్లేయర్ల సామర్థ్యాన్ని పరీక్షించడానికి వాడుకోవాలని భారత్ భావిస్తోంది. ప్రస్తుతం మూడో స్థానంలో ఇషాన్ కిషన్ ఆడుతున్నప్పటికీ, జైస్వాల్‌ను కూడా కాసేపు పరీక్షించాలనే యోచనలో మేనేజ్‌మెంట్ ఉంది. ఇషాన్, రాహుల్, జైస్వాల్‌లలో ఎవరిని ఏ స్థానంలో ఆడించాలనే అంశంపై ప్రయోగాలు చేస్తున్నట్లు బౌలింగ్ కోచ్ మోర్నీ మోర్కెల్ క్లారిటీ ఇచ్చారు.

ఇక తొలి మ్యాచ్‌లో దురదృష్టవశాత్తూ త్వరగానే రనౌట్ అయిన సీనియర్ ఓపెనర్ రోహిత్ శర్మ.. ఈ మ్యాచ్‌లో భారీ స్కోరుపై కన్నేశాడు. పిచ్ కండిషన్స్ బట్టి హర్ష్ దూబే స్థానంలో కుల్దీప్ యాదవ్ బరిలోకి దిగే ఛాన్స్ ఉంది. పేసర్ గుర్నూర్ బ్రార్ తన స్థానాన్ని నిలబెట్టుకోగా, ప్రిన్స్ యాదవ్ తన అవకాశం కోసం నిరీక్షిస్తున్నాడు.

మరోవైపు అఫ్గానిస్తాన్ జట్టు బ్యాటింగ్ విభాగంలో సమిష్టిగా రాణించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. తొలి మ్యాచ్‌లో ఓపెనర్ రహ్మానుల్లా గుర్బాజ్ ఒంటరి పోరాటం చేస్తూ సెంచరీ బాదినా.. మిగతా బ్యాటర్ల నుంచి అతనికి అస్సలు సహకారం లభించలేదు. ఇక అఫ్గాన్‌కు ప్రధాన బలమైన రషీద్ ఖాన్, గజన్‌ఫర్, మహ్మద్ నబీ లాంటి వరల్డ్ క్లాస్ స్పిన్నర్లు మొదటి మ్యాచ్‌లో భారత బ్యాటర్లను పెద్దగా ఇబ్బంది పెట్టలేకపోయారు. అయితే, లక్నో పిచ్ స్పిన్నర్లకు అనుకూలించే అవకాశం ఉండటంతో.. ఈ మ్యాచ్‌లో అఫ్గాన్ స్పిన్ త్రయం ఖచ్చితంగా పుంజుకుంటుందని ఆ జట్టు ఆశిస్తోంది.

Tags:    

Similar News