Women's T20 World Cup: వరల్డ్ కప్‌లో భారత్ రెండో సమరం.. నెదర్లాండ్స్‌తో హర్మన్‌ప్రీత్ సేన ఫైట్
నెదర్లాండ్స్‌తో హర్మన్‌ప్రీత్ సేన ఫైట్
Women's T20 World Cup: విమెన్స్ టీ20 వరల్డ్ కప్‌లో హర్మన్‌ప్రీత్ సేన మరో కీలక పోరుకు సిద్ధమైంది. ఇవాళ జరిగే తన రెండో మ్యాచ్‌లో నెదర్లాండ్స్‌తో అమీతుమీ తేల్చుకోనుంది. సాంప్రదాయ ప్రత్యర్థి పాకిస్తాన్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో భారత్ విజయం సాధించినప్పటికీ.. బ్యాటింగ్ విభాగంలో ఉన్న లోపాలను సరిదిద్దుకుని, ఈ మ్యాచ్‌లో మరింత పటిష్టమైన ప్రదర్శన చేయడమే లక్ష్యంగా పెట్టుకుంది.
తొలి మ్యాచ్‌లో ఓపెనర్ స్మృతి మంధాన, లోయర్ ఆర్డర్‌లో రిచా ఘోష్ బాధ్యతాయుతంగా రాణించి జట్టును గెలిపించారు. అయితే మరో ఓపెనర్ షఫాలీ వర్మ, కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ ఆశించిన స్థాయిలో ఆడలేకపోయారు. మిడిల్ ఆర్డర్‌లో కీలకమైన భారతి ఫుల్మాలి సైతం తీవ్రంగా నిరాశపరిచింది. లీగ్ దశలో ముందు ముందు బలమైన జట్లతో మ్యాచ్‌లు ఉన్నందున.. ఇండియా టాప్ ఆర్డర్ బ్యాటర్లు ఫామ్‌లోకి రావడం అత్యవసరంగా మారింది. నెదర్లాండ్స్‌పై గెలవడం భారత్‌కు పెద్ద కష్టం కాకపోయినప్పటికీ.. సెమీఫైనల్ రేసులో నిలవాలంటే లీగ్ దశలో ఆస్ట్రేలియా లేదా సౌతాఫ్రికా వంటి బలమైన జట్లలో ఒకరిని కచ్చితంగా ఓడించాల్సి ఉంటుంది.
ఇక బౌలింగ్ విషయానికి వస్తే.. ఇండియా పేసర్లు అరుంధతి రెడ్డి, క్రాంతి గౌడ్ తొలి మ్యాచ్‌లో పెద్దగా ప్రభావం చూపలేకపోయారు. కానీ, టీమిండియా స్పిన్ ద్వయం దీప్తి శర్మ, శ్రీ చరణి మాత్రం అద్భుత ఫామ్‌లో ఉన్నారు. వీరిద్దరూ కలిసి గత మ్యాచ్‌లోనే ఏకంగా 8 వికెట్లు పడగొట్టి పాక్ నడుం విరిచారు. ఈ మ్యాచ్‌లోనూ వీరి స్పిన్ మ్యాజిక్‌పైనే జట్టు భారీగా ఆశలు పెట్టుకుంది. మరోవైపు తొలి మ్యాచ్‌లో బంగ్లాదేశ్ చేతిలో పరాజయం పాలైన నెదర్లాండ్స్.. ఈ మ్యాచ్‌లో భారత్‌కు గట్టి పోటీ ఇచ్చి టోర్నీలో నిలవాలని చూస్తోంది.