India vs Ireland T20I: ఇండియా vs ఐర్లాండ్ టీ20... వైభవ్ ఆడకపోవడానికి కారణం ఇదే
వైభవ్ ఆడకపోవడానికి కారణం ఇదే
India vs Ireland T20I: భారత్, ఐర్లాండ్ మధ్య మొదటి టీ20 మ్యాచ్ జరిగింది. బెల్ఫాస్ట్ వేదికగా జరిగిన ఈ తొలి మ్యాచ్‌లో టాస్ గెలిచిన భారత కెప్టెన్ శ్రేయస్ అయ్యర్.. ఏమాత్రం ఆలస్యం చేయకుండా మొదట ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. అయితే, టాస్ గెలిచిన ఆనందంలో ఉన్న అభిమానులకు ఈ మ్యాచ్ ద్వారా అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్రం చేస్తాడని అందరూ ఎంతగానో ఆశపడిన 15 ఏళ్ల వండర్ కిడ్.. వైభవ్ సూర్యవంశీకి తుది జట్టులో స్థానం దక్కలేదు. భారత క్రికెట్ భవిష్యత్తుగా భావిస్తున్న ఈ యంగ్ సెన్సేషన్ మొదటి మ్యాచ్‌లోనే బరిలోకి దిగుతాడని ఫ్యాన్స్ ఆశించారు.. కానీ టీమ్ మేనేజ్మెంట్ మాత్రం అతడిని బెంచ్‌కే పరిమితం చేసింది.
అయితే వైభవ్ సూర్యవంశీని పక్కన పెట్టడంపై టాస్ సమయంలో కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ క్లారిటీ ఇచ్చాడు. "బెల్ఫాస్ట్ మైదానంలోని వాతావరణం, పిచ్ కండిషన్స్ మాకు పూర్తిగా కొత్తవి. అందుకే మొదట బౌలింగ్ చేసి.. పిచ్ ఎలా స్పందిస్తుందో చూడాలనుకుంటున్నాం. ఇక వైభవ్ విషయానికి వస్తే.. దురదృష్టవశాత్తూ అతను ఈరోజు మ్యాచ్ ఆడటం లేదు. మా టీంలో అద్భుతమైన ప్లేయర్స్ ఉన్నారు.. అయితే ప్రస్తుతానికైతే గతంలో మంచి ప్రదర్శన చేసిన సీనియర్ ప్లేయర్ల వైపే మేము మొగ్గు చూపాం. కచ్చితంగా సరైన సమయం వచ్చినప్పుడు వైభవ్‌కు అవకాశం దక్కుతుంది" అని శ్రేయస్ స్పష్టం చేశాడు.
పిచ్ పరిస్థితులకు తగ్గట్టుగా టీమిండియా మేనేజ్మెంట్ పక్కా ప్లానింగ్‌తో బరిలోకి దిగుతున్నట్లు కెప్టెన్ తెలిపాడు. ఈ మ్యాచ్ కోసం భారత్ సెలక్ట్ చేసుకున్న కాంబినేషన్ చూస్తే.. ఇద్దరు ఫాస్ట్ బౌలర్లు, ఒక ఆల్రౌండర్, మరో ఇద్దరు స్పిన్నర్లతో బరిలోకి దిగింది. మరి వైభవ్‌కు నెక్స్ట్ మ్యాచ్‌ల్లో అయినా ఛాన్స్ దక్కుతుందో లేదో చూడాలి!