IPL 2026 Auction: ఐపీఎల్ 2026 వేలం: జాబితా నుంచి 1,005 మంది ఆటగాళ్ల తొలగింపు

జాబితా నుంచి 1,005 మంది ఆటగాళ్ల తొలగింపు

Update: 2025-12-09 07:06 GMT

IPL 2026 Auction: వచ్చే ఐపీఎల్ 2026 సీజన్‌కు సంబంధించిన మినీ-వేలానికి రంగం సిద్ధమైంది. ఈ నేపథ్యంలో, భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) తుది ఆటగాళ్ల జాబితాను విడుదల చేసింది. వేలంలోకి రావడానికి తొలుత రిజిస్టర్ చేసుకున్న 1,355 మంది ఆటగాళ్లలో, 1,005 మంది పేర్లను తొలగించి, కేవలం 350 మంది ఆటగాళ్లతో కూడిన తుది జాబితాను బీసీసీఐ ఖరారు చేసింది. ఫ్రాంచైజీల సూచనలు, అవసరాల మేరకు ఈ భారీ కోత విధించడం జరిగింది.

తుది జాబితాకు సంబంధించిన అతిపెద్ద సర్‌ప్రైజ్ ఏంటంటే, దక్షిణాఫ్రికాకు చెందిన స్టార్ వికెట్ కీపర్-బ్యాటర్ క్వింటన్ డి కాక్ అనూహ్యంగా మళ్లీ వేలంలోకి రావడం. డి కాక్ పేరు అసలు రిజిస్టర్ చేసుకున్న ఆటగాళ్ల జాబితాలో లేనప్పటికీ, ఒక ఫ్రాంచైజీ అభ్యర్థన మేరకు అతన్ని తుది జాబితాలో చేర్చినట్లు సమాచారం.

ఇటీవల అంతర్జాతీయ వన్డే రిటైర్మెంట్ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్న డి కాక్, భారత్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో మెరుపు సెంచరీ చేయడం ద్వారా తిరిగి ఫామ్‌లోకి వచ్చాడు. ఈ ప్రదర్శనతోనే ఒక ఫ్రాంచైజీ అతన్ని ప్రత్యేకంగా వేలం జాబితాలో చేర్చాలని కోరినట్లు తెలుస్తోంది. డి కాక్ ప్రాథమిక ధర ₹1 కోటిగా నిర్ణయించారు.

ఐపీఎల్ 2026 మినీ వేలం డిసెంబర్ 16వ తేదీన అబుదాబిలోని ఎతిహాద్ అరేనాలో భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 2:30 గంటలకు ప్రారంభం కానుంది. ఈ వేలంలో 10 ఫ్రాంచైజీలు గరిష్టంగా 77 ఖాళీలను (స్లాట్లను) భర్తీ చేసుకోవడానికి పోటీపడతాయి. అత్యధిక పర్స్ విలువ (మిగిలిన సొమ్ము) కలిగి ఉన్న కోల్‌కతా నైట్ రైడర్స్ (₹64.3 కోట్లు), చెన్నై సూపర్ కింగ్స్ (₹43.4 కోట్లు) లాంటి జట్లు కీలక ఆటగాళ్ల కోసం తీవ్రంగా పోటీపడే అవకాశం ఉంది.

Tags:    

Similar News