IPL 2026: ఐపీఎల్ ఫైనల్ ఓటమి తర్వాత గుజరాత్ టైటాన్స్ టీమ్ బస్సుకు ప్రమాదం
గుజరాత్ టైటాన్స్ టీమ్ బస్సుకు ప్రమాదం
IPL 2026: ఐపీఎల్ 2026 ఫైనల్ మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) చేతిలో ఓటమి చవిచూసిన గుజరాత్ టైటాన్స్ (GT) జట్టుకు ఆదివారం రాత్రి మరో ఊహించని చేదు అనుభవం ఎదురైంది. మ్యాచ్ ముగిసిన అనంతరం ఆటగాళ్లు, సపోర్ట్ స్టాఫ్ స్టేడియం నుండి తిరిగి హోటల్‌కు ప్రయాణిస్తుండగా వారి టీమ్ బస్సులో షార్ట్ సర్క్యూట్ సంభవించింది.
బస్సు రోడ్డుపై వెళ్తుండగానే ఈ సాంకేతిక లోపం తలెత్తడంతో ఒక్కసారిగా లోపల దట్టమైన పొగలు అలుముకున్నాయి. దీంతో బస్సును వెంటనే నిలిపివేసి, అందులోని ఆటగాళ్లను, సిబ్బందిని అత్యవసరంగా కిందకు దించేశారు (ఎవాక్యుయేట్ చేశారు). అదృష్టవశాత్తూ ఈ ప్రమాదంలో ఎవరికీ ఎటువంటి గాయాలు కాలేదు, ఆటగాళ్లందరూ సురక్షితంగా బయటపడ్డారు. ప్రత్యామ్నాయంగా మరొక బస్సును ఏర్పాటు చేసే వరకు ఆటగాళ్లు కాసేపు రోడ్డు పక్కనే నిలబడాల్సి వచ్చింది. ఆ తర్వాత వచ్చిన రెండో బస్సులో వారంతా సురక్షితంగా హోటల్‌కు చేరుకున్నారు.
ఇప్పటికే ఐపీఎల్ టైటిల్ చేజారిందనే నిరాశలో ఉన్న గుజరాత్ జట్టుకు ఈ ప్రమాదం మరింత ఆందోళన కలిగించింది. నిన్న జరిగిన హోరాహోరీ ఫైనల్ పోరులో మొదట బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్ 20 ఓవర్లలో 155/8 పరుగులు చేయగా, ఆ లక్ష్యాన్ని ఆర్సీబీ 18 ఓవర్లలోనే 5 వికెట్లు కోల్పోయి ఛేదించి వరుసగా రెండోసారి ఐపీఎల్ ట్రోఫీని ముద్దాడింది.