IPL 2026: కోల్ కతాకు నాల్గో ఓటమి

నాల్గో ఓటమి

Update: 2026-04-15 05:47 GMT

IPL 2026: ఐపీఎల్-19లో కోల్‌కతా నైట్ రైడర్స్ కష్టాలు తీరడం లేదు. బ్యాటింగ్ వైఫల్యంతో కేకేఆర్ వరుసగా నాలుగో ఓటమిని చవిచూసింది. మంగళవారం జరిగిన రసవత్తర పోరులో చెన్నై సూపర్ కింగ్స్ 32 పరుగుల తేడాతో కోల్‌కతాను మట్టికరిపించింది.

టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన చెన్నై బ్యాటర్లు కోల్‌కతా బౌలర్లపై విరుచుకుపడ్డారు. కెప్టెన్ సంజూ శాంసన్ 32 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సర్లతో 48 పరుగులు చేసి ఇన్నింగ్స్‌ను నడిపించగా.. యంగ్ సెన్సేషన్ డేవాల్డ్ బ్రెవిస్ 41 పరుగులతో మెరుపులు మెరిపించాడు. చివర్లో ఆయుష్ మాత్రే కేవలం 17 బంతుల్లోనే 38 రన్స్ చేసి స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. దీంతో చెన్నై నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 192 పరుగుల భారీ స్కోరు సాధించింది.

193 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కోల్‌కతాకు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఏ ఒక్క టాప్ ఆర్డర్ బ్యాటర్ కూడా క్రీజులో నిలదొక్కుకోలేకపోయారు. రమన్‌దీప్ సింగ్ 37 పరుగులు, రొవ్‌మన్ పావెల్ 31 పరుగులతో పోరాడినప్పటికీ.. అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. చెన్నై స్పిన్నర్ నూర్‌ అహ్మద్ తన స్పిన్ మాయాజాలంతో 3 వికెట్లు పడగొట్టి కోల్‌కతా నడ్డి విరిచాడు. దీంతో కేకేఆర్ 160 పరుగులకే పరిమితమై ఓటమిని అంగీకరించింది.అద్భుత స్పెల్‌తో ఆకట్టుకున్న నూర్‌ అహ్మద్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు దక్కింది. ఈ విజయంతో చెన్నై ఫుల్ జోష్‌లో ఉండగా.. వరుస ఓటములతో కుంగిపోతున్న కోల్‌కతా మళ్ళీ పుంజుకుంటుందో లేదో చూడాలి!

Tags:    

Similar News