IPL 2026: రాయల్స్ గర్జన.. వరుస పరాజయాలకు చెక్.. లక్నోపై ఘన విజయం
లక్నోపై ఘన విజయం
IPL 2026: ఐపీఎల్-19 రసవత్తరంగా సాగుతోంది. వరుసగా రెండు ఓటములతో డీలా పడ్డ రాజస్థాన్ రాయల్స్.. మళ్ళీ విక్టరీ ట్రాక్ ఎక్కింది. లో స్కోరింగ్ మ్యాచ్‌ను కూడా ఎలా కాపాడుకోవాలో చూపిస్తూ, లక్నో సూపర్ జెయింట్స్‌పై పంజా విసిరింది. అటు బ్యాటింగ్‌లోనూ, ఇటు బౌలింగ్‌లోనూ సమష్టిగా రాణించి 40 పరుగుల తేడాతో ఘనవిజయాన్ని అందుకుంది.
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన రాజస్థాన్ రాయల్స్‌కు ఆదిలోనే చుక్కెదురైనా.. రవీంద్ర జడేజా తన అనుభవంతో జట్టును ఆదుకున్నాడు. లక్నో బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో పరుగులు తీయడం కష్టమైన వేళ.. జడ్డూ 29 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్సర్‌తో విలువైన 43 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. దీంతో రాజస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో 159 పరుగుల గౌరవప్రదమైన స్కోరు చేయగలిగింది.
160 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన లక్నోకు జోఫ్రా ఆర్చర్ రూపంలో పెద్ద ముప్పు ఎదురైంది. తన నిప్పులు చెరిగే బౌలింగ్‌తో లక్నో బ్యాటింగ్ ఆర్డర్‌ను ఆర్చర్ కంపాంచాడు. కేవలం 20 పరుగులు ఇచ్చి 3 కీలక వికెట్లు పడగొట్టి లక్నో నడ్డి విరిచాడు. లక్నో జట్టులో మిచెల్ మార్ష్ ఒక్కడే ఒంటరి పోరాటం చేశాడు. 41 బంతుల్లో 6 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 55 పరుగులు చేసినా.. అతనికి అవతలి ఎండ్ నుంచి సహకారం లభించలేదు.
రాజస్థాన్ బౌలర్లందరూ సమిష్టిగా రాణించడంతో లక్నో బ్యాటర్లు ఒత్తిడికి లోనయ్యారు. వరుస వికెట్లు కోల్పోతూ కేవలం 18 ఓవర్లలోనే 119 పరుగులకు కుప్పకూలారు. లక్నోకు ఇది వరుసగా నాలుగో ఓటమి కావడం వారి అభిమానులను తీవ్ర నిరాశకు గురిచేసింది. ఆల్ రౌండ్ షోతో అదరగొట్టిన రవీంద్ర జడేజాకు 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డు దక్కింది.