IPL 2026: ఐపీఎల్‌లో సంజు శాంసన్ సరికొత్త చరిత్ర.. అత్యంత వేగంగా 5 వేల పరుగుల క్లబ్ లోకి
అత్యంత వేగంగా 5 వేల పరుగుల క్లబ్ లోకి
IPL 2026: ఐపీఎల్ 2026 సీజన్‌లో సరికొత్త చరిత్ర నమోదైంది. చెన్నై సూపర్ కింగ్స్ స్టార్ బ్యాటర్ సంజు శాంసన్ తన కెరీర్‌లో మరుపురాని మైలురాయిని చేరుకున్నాడు. గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కేవలం 11 పరుగులు చేసినప్పటికీ, ఈ చిన్న ఇన్నింగ్స్‌తోనే సంజూ ఒక భారీ రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు.
చెన్నైలోని చిదంబరం స్టేడియం వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో.. ఐపీఎల్ కెరీర్‌లో 5000 పరుగుల మైలురాయిని అందుకున్న 10వ ఆటగాడిగా సంజు శాంసన్ నిలిచాడు. అయితే ఇక్కడ విశేషం ఏంటంటే.. ఈ ఘనతను అతడు అత్యంత వేగంగా సాధించడం! కేవలం 3,555 బంతుల్లోనే 5000 పరుగుల మార్కును చేరిన సంజూ.. ఐపీఎల్ చరిత్రలో అత్యంత వేగంగా ఈ మైలురాయిని అందుకున్న భారత బ్యాటర్‌గా అగ్రస్థానాన్ని కైవసం చేసుకున్నాడు.
ఈ క్రమంలో సంజు శాంసన్ భారత దిగ్గజ ఆటగాళ్ల రికార్డులను తిరగరాశాడు. గతంలో సురేష్ రైనా 3620 బంతుల్లో, కేఎల్ రాహుల్ 3688 బంతుల్లో, ఎంఎస్ ధోనీ 3691 బంతుల్లో ఈ ఫీట్ సాధించగా.. ఇప్పుడు వారందరినీ వెనక్కి నెట్టి సంజూ నంబర్ వన్ ప్లేస్‌కు చేరుకున్నాడు. ఇక ఓవరాల్‌గా చూస్తే.. ఏబీ డివిలియర్స్ (3288 బంతులు), డేవిడ్ వార్నర్ (3554 బంతులు) తర్వాత ప్రపంచవ్యాప్తంగా మూడో స్థానంలో సంజూ నిలిచాడు.
గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన ఈ మ్యాచ్‌లో సంజూ ఇన్నింగ్స్‌ను చాలా జాగ్రత్తగా మొదలుపెట్టాడు. మహమ్మద్ సిరాజ్ వేసిన తొలి ఓవర్‌లో ఆచితూచి ఆడిన సంజూ.. ఆ తర్వాత కగిసో రబాడ వేసిన ఓవర్‌లో బౌండరీ బాది 5000 పరుగుల క్లబ్‌లోకి ఘనంగా ఎంట్రీ ఇచ్చాడు. స్టేడియంలోని అభిమానుల కేరింతల మధ్య ఈ అరుదైన రికార్డు ఆవిష్కృతమైంది.