IPL 2026: సంజూ సూపర్ సెంచరీ..చెన్నై చేతిలో ముంబై చిత్తు
చెన్నై చేతిలో ముంబై చిత్తు
IPL 2026: ఐపీఎల్-19 రసవత్తరంగా సాగుతోంది. గురువారం జరిగిన హై-వోల్టేజ్ పోరులో చెన్నై సూపర్ కింగ్స్ ఊహించని రీతిలో ముంబై ఇండియన్స్‌ను చిత్తు చేసింది. ఈ మ్యాచ్ అనగానే అందరూ ముంబై బౌలింగ్‌పై ఆశలు పెట్టుకున్నారు, కానీ గ్రౌండ్‌లోకి సంజూ శాంసన్ అడుగుపెట్టాక సీన్ మొత్తం మారిపోయింది. సిఎస్కే బ్యాటర్ల విధ్వంసానికి వాంఖడే స్టేడియం హోరెత్తిపోయింది!"
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన చెన్నైకి సంజూ శాంసన్ వెన్నెముకలా నిలిచాడు. ముంబై స్టార్ బౌలర్లను ఉతికేస్తూ.. కేవలం 54 బంతుల్లోనే 10 ఫోర్లు, 6 సిక్సర్లతో అజేయమైన సెంచరీ బాదాడు. 101 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచిన సంజూకి.. ఈ సీజన్‌లో ఇది రెండో సెంచరీ కావడం విశేషం. శాంసన్ ధాటికి నిర్ణీత 20 ఓవర్లలో చెన్నై 6 వికెట్ల నష్టానికి 207 పరుగుల భారీ స్కోరు సాధించింది."
208 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్‌కు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. తిలక్ వర్మ 37 పరుగులు, సూర్యకుమార్ యాదవ్ 35 పరుగులతో పోరాడే ప్రయత్నం చేసినా.. మిగతా బ్యాటర్లందరూ పేకమేడలా కూలిపోయారు. ముఖ్యంగా చెన్నై బౌలర్ అకీల్ హుస్సేన్ స్పిన్ మాయాజాలానికి ముంబై బ్యాటర్ల దగ్గర సమాధానం లేకుండా పోయింది. అకీల్ 17 పరుగులకే 4 వికెట్లు తీసి ముంబై వెన్ను విరిచాడు.
ఫలితంగా, ముంబై కేవలం 104 పరుగులకే ఆలౌట్ అయ్యింది. 103 పరుగుల భారీ తేడాతో చెన్నై ఘన విజయం సాధించింది. తన అద్భుతమైన సెంచరీతో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన సంజూ శాంసన్‌కు 'ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్' అవార్డు లభించింది. ఈ విజయంతో సిఎస్కే పాయింట్ల పట్టికలో దూసుకుపోతుండగా.. ముంబై పతనం అభిమానులను ఆందోళనకు గురిచేస్తోంది.