IPL 2026: ఐపీఎల్‌లో నిబంధనల ఉల్లంఘన కలకలం రేపుతోంది! మైదానంలో ఆటగాళ్లు ఎంత క్రమశిక్షణతో ఉండాలో.. డగౌట్‌లో కూర్చునే టీమ్ మేనేజ్‌మెంట్ కూడా అంతే బాధ్యతగా ఉండాలి. కానీ, రాజస్థాన్ రాయల్స్ టీమ్ మేనేజర్ రోమీ భిందర్ చేసిన ఒక చిన్న పొరపాటు ఇప్పుడు పెద్ద వివాదానికి దారితీసింది. నిబంధనలను అతిక్రమించినందుకు గాను బీసీసీఐ (BCCI) ఆయనకు గట్టి షాక్ ఇచ్చింది.

అసలేం జరిగిందంటే.. ఈ నెల 10న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, రాజస్థాన్ రాయల్స్ మధ్య హోరాహోరీ మ్యాచ్ జరిగింది. ఆ సమయంలో డగౌట్‌లో కూర్చున్న టీమ్ మేనేజర్ రోమీ భిందర్.. బహిరంగంగా మొబైల్ ఫోన్ మాట్లాడుతూ కెమెరా కంటికి చిక్కారు. ఐసీసీ (ICC) మరియు బీసీసీఐ నిబంధనల ప్రకారం.. మ్యాచ్ జరుగుతున్న సమయంలో డగౌట్ లేదా డ్రెస్సింగ్ రూమ్‌లో ఎలక్ట్రానిక్ పరికరాలు, ముఖ్యంగా మొబైల్ ఫోన్లు వాడటం నిషిద్ధం.

ఈ ఘటన జరిగిన సమయంలో ఆయన పక్కనే యువ ఆటగాడు వైభవ్ సూర్యవంశీ కూడా ఉండటంతో దీనిపై తీవ్ర దుమారం రేగింది. యాంటీ కరప్షన్ అండ్ సెక్యూరిటీ యూనిట్ (ACSU) నిబంధనల ప్రకారం.. ఇది భద్రతా పరమైన ఉల్లంఘనగా పరిగణించబడుతుంది. దీంతో వెంటనే రంగంలోకి దిగిన బీసీసీఐ.. రోమీ భిందర్‌కు షోకాజ్ నోటీసులు జారీ చేసింది.

ఈ నోటీసుపై వచ్చే 48 గంటల్లోగా వివరణ ఇవ్వాలని బోర్డు ఆదేశించింది. అసలు మ్యాచ్ మధ్యలో ఫోన్ వాడాల్సిన అవసరం ఏమొచ్చింది? ఎవరితో మాట్లాడారు? అనే కోణంలో అధికారులు విచారణ జరుపుతున్నారు. ఒకవేళ ఆయన ఇచ్చే సమాధానం సంతృప్తికరంగా లేకపోతే.. భిందర్‌పై కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉంది.

Tags: