IPL 2026: ఐపీఎల్ హిస్టరీలోనే వాళ్లది బెస్ట్ జోడీ..గిల్, సుదర్శన్ పై రైనా ప్రశంసలు

గిల్, సుదర్శన్ పై రైనా ప్రశంసలు

Update: 2026-05-26 06:12 GMT

IPL 2026: ఐపీఎల్ 2026 క్వాలిఫయర్-1కు సమయం ఆసన్నమైన వేళ.. గుజరాత్ టైటాన్స్ ఓపెనింగ్ జోడీ శుభ్‌మన్ గిల్, సాయి సుదర్శన్‌లపై టీమ్ ఇండియా మాజీ క్రికెటర్ సురేష్ రైనా ప్రశంసల వర్షం కురిపించారు. ఐపీఎల్ చరిత్రలోనే వీరిద్దరూ అత్యుత్తమ బ్యాటింగ్ జోడీ అంటూ రైనా ఆకాశానికెత్తేశారు. కేవలం 46 ఇన్నింగ్స్‌ల్లోనే 21 సార్లు యాభైకి పైగా పరుగుల భాగస్వామ్యాలను నెలకొల్పి.. ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత వేగంగా ఈ మైలురాయిని అందుకున్న జోడీగా రికార్డు సృష్టించారని ఆయన కొనియాడారు.

ఓపెనర్లుగా గిల్, సుదర్శన్‌ల నిలకడ అద్భుతమని రైనా పేర్కొన్నారు. క్రీజులోకి వచ్చాక ఇన్నింగ్స్ నిర్మించుకోవడానికి వారు తీసుకునే సమయం, డాట్ బాల్స్ లేకుండా సింగిల్స్ తీసే విధానం అమోఘమన్నారు. ఒకరు బౌలర్ వేగాన్ని వాడుకుంటూ పరుగులు రాబడితే.. మరొకరు భారీ షాట్లతో విరుచుకుపడతారని, పక్కా ప్లానింగ్‌తో కొంతమంది బౌలర్లను టార్గెట్ చేస్తూ ఆడటం వీరి ప్రత్యేకత అని రైనా విశ్లేషించారు. అద్భుతమైన ఫిట్‌నెస్, ఆటపై పూర్తి అవగాహన ఉన్న ఈ జోడీ లాంటి నిలకడ.. ఈ సీజన్ ఐపీఎల్‌లో మరే ఇతర బ్యాటింగ్ జోడీలోనూ కనిపించలేదని స్పష్టం చేశారు.

ఈ సీజన్ ఐపీఎల్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో గుజరాత్ టైటాన్స్ ఓపెనర్లే టాప్-2 లో దూసుకుపోతున్నారు. సాయి సుదర్శన్ 638 పరుగులతో అగ్రస్థానంలో ఉండగా.. కెప్టెన్ శుభ్‌మన్ గిల్ 616 పరుగులతో రెండో స్థానంలో నిలిచారు. ఇవాళ ధర్మశాల వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరగనున్న హై-వోల్టేజ్ క్వాలిఫయర్-1 మ్యాచ్‌లో.. గుజరాత్ టైటాన్స్ ఫైనల్ చేరాలంటే ఈ స్టార్ ఓపెనింగ్ జోడీ రాణించడం అత్యంత కీలకంగా మారింది.

Tags:    

Similar News