Kris Srikkanth Makes Shocking Remarks: ఐపీఎల్ సీజన్ రసవత్తరంగా సాగుతున్న వేళ, లక్నో సూపర్ జెయింట్స్ క్యాంప్‌లో ఆందోళన మొదలైంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన హై-వోల్టేజ్ మ్యాచ్‌లో కెప్టెన్ రిషబ్ పంత్ తీవ్రంగా గాయపడటం ఇప్పుడు ఆ జట్టును కోలుకోలేని దెబ్బ తీసేలా కనిపిస్తోంది. పంత్ గాయం తీవ్రతపై క్రికెట్ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది.

ఆర్సీబీతో మ్యాచ్ సందర్భంగా బ్యాటింగ్ చేస్తున్న సమయంలో, బంతి పంత్ ఎడమ మోచేతికి బలంగా తగిలింది. నొప్పితో విలవిలలాడిన పంత్.. ఆ తర్వాత మైదానాన్ని వీడాల్సి వచ్చింది. అయితే ఈ గాయం కారణంగా పంత్ ఈ సీజన్ మొత్తానికి దూరమయ్యే అవకాశం ఉందని టీమ్ ఇండియా మాజీ ఓపెనర్ కృష్ణమాచారి శ్రీకాంత్ అభిప్రాయపడ్డారు. పంత్ వంటి కీలక ఆటగాడు దూరం కావడం లక్నో ఆశలపై నీళ్లు చల్లినట్లేనని విశ్లేషకులు భావిస్తున్నారు.

తన యూట్యూబ్ ఛానల్‌ వేదికగా లక్నో టీమ్ ప్రదర్శనపై శ్రీకాంత్ నిప్పులు చెరిగారు. లక్నోను ఒక "దారుణమైన జట్టు"గా ఆయన అభివర్ణించారు. "ఐదు మ్యాచ్‌లు పూర్తయినా ఆ జట్టు బ్యాటింగ్ విభాగం అస్సలు గాడిలో పడటం లేదు. ఒక్క బౌలింగ్ విభాగం మాత్రమే కాస్త మెరుగ్గా ఉంది తప్ప, బ్యాటర్లలో ఏమాత్రం కసి కనిపించడం లేదు" అంటూ చిల్లీ శ్రీకాంత్ తన స్టైల్లో విమర్శలు గుప్పించారు.కెప్టెన్ పంత్ అందుబాటులో లేకపోతే, లక్నో బ్యాటింగ్ ఆర్డర్ మరింత కుప్పకూలే ప్రమాదం ఉంది. ఇప్పటికే పాయింట్ల పట్టికలో వెనుకబడి ఉన్న ఆ జట్టుకు, మిగిలిన మ్యాచ్‌లలో గెలవడం ఇప్పుడు హిమాలయ పర్వతాన్ని ఎక్కినంత కష్టంగా మారింది.

Tags: