Italy Supports Increase in Prize Money: టెన్నిస్ కోర్టులో ఇప్పుడు కేవలం ఆట మాత్రమే కాదు.. హక్కుల పోరాటం కూడా మొదలైంది. టెన్నిస్ క్రీడాకారులు గత కొంతకాలంగా కోరుతున్న ప్రైజ్ మనీ పెంపునకు ఇటలీ టెన్నిస్ ఫెడరేషన్ గట్టి మద్దతు ప్రకటించింది. ప్రపంచ టెన్నిస్‌లో నాలుగు గ్రాండ్‌స్లామ్‌ల ఆధిపత్యానికి చెక్ పెట్టే సమయం ఆసన్నమైందని ఇటలీ టెన్నిస్ ఫెడరేషన్ అధ్యక్షుడు ఏంజెలో బినాఘీ సంచలన వ్యాఖ్యలు చేశారు.

బినాఘీ మాటల్లో చెప్పాలంటే.. గ్రాండ్‌స్లామ్ నిర్వాహక దేశాలు వేల కోట్లు ఆర్జిస్తూ, ఆ ఆటను ఆడే క్రీడాకారులకు మాత్రం అతి తక్కువ వాటా ఇవ్వడం అత్యంత అవమానకరం. అందుకే, ఈ గుత్తాధిపత్యాన్ని బద్దలు కొట్టాలని ఆయన పిలుపునిచ్చారు. అంతటితో ఆగకుండా, ఇటాలియన్ ఓపెన్‌ను ప్రపంచంలోనే 'ఐదో గ్రాండ్‌స్లామ్'గా మార్చాలనే తన పట్టుదలను ఆయన మరోసారి స్పష్టం చేశారు.ఈ సందర్భంగా ఒక చారిత్రాత్మక మార్పును కూడా బినాఘీ ప్రపంచానికి చాటి చెప్పారు. ఇన్నాళ్లూ క్రీడల్లో పురుషుల కంటే మహిళలకు తక్కువ ప్రైజ్ మనీ ఇచ్చే వివక్ష ఉండేది. కానీ, వచ్చే వారం రోమ్‌లో జరగనున్న ఇటాలియన్ ఓపెన్‌లో ఈ సీన్ రివర్స్ కాబోతోంది.

రోమ్ విజేతగా నిలిచే మహిళా క్రీడాకారిణి ఏకంగా 1.055 మిలియన్ యూరోల భారీ ప్రైజ్ మనీని అందుకోనుంది. ఇది పురుషుల విజేతకు అందే మొత్తం అంటే.. 1.007 మిలియన్ యూరోల కంటే కూడా ఎక్కువ కావడం విశేషం. సమానత్వం దిశగా ఇటలీ వేసిన ఈ అడుగు ఇప్పుడు క్రీడా ప్రపంచంలో హాట్ టాపిక్ అయ్యింది.నిజానికి, ఆటగాళ్లకు వచ్చే ఆదాయంలో గ్రాండ్‌స్లామ్ నిర్వాహకులు కోత విధించడాన్ని నిరసిస్తూ.. టాప్ ప్లేయర్లు బహిష్కరణకు కూడా సిద్ధమవుతున్నారు. ఈ తరుణంలో ఇటలీ ఫెడరేషన్ వారికి అండగా నిలవడం టెన్నిస్ భవిష్యత్తును మార్చేలా కనిపిస్తోంది.

Tags: