Junior Hockey World Cup: ఇండియాలో జూనియర్ హాకీ వరల్డ్ కప్.. తప్పుకున్న పాక్
తప్పుకున్న పాక్
Junior Hockey World Cup: భారత్ వేదికగా నవంబర్ 28 నుంచి జరగనున్న ఎఫ్‌ఐహెచ్ (FIH) పురుషుల హాకీ జూనియర్ ప్రపంచకప్-2025 నుంచి పాకిస్థాన్ తప్పుకుంది. ఇరు దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్త రాజకీయ పరిస్థితుల కారణంగా ఈ మెగా టోర్నీలో పాల్గొనకూడదని పాకిస్థాన్ హాకీ సమాఖ్య (PHF) నిర్ణయించుకుంది. ఈ విషయాన్ని అంతర్జాతీయ హాకీ సమాఖ్య (FIH) కూడా ధృవీకరించింది. పాకిస్థాన్ స్థానంలో ప్రత్యామ్నాయంగా ఏ జట్టును ఎంపిక చేస్తారనేది త్వరలో ప్రకటిస్తామని ఎఫ్‌ఐహెచ్ తెలిపింది. తమిళనాడులోని చెన్నై, మధురై నగరాల్లో ఈ టోర్నమెంట్ జరగాల్సి ఉంది. భారత్, పాకిస్థాన్‌ల మధ్య దౌత్య, రాజకీయ సంబంధాలు క్షీణించడం ప్రధాన కారణంగా తెలుస్తోంది. ప్రస్తుత పరిస్థితుల్లో తమ జట్టును భారత్‌కు పంపడం భద్రతాపరంగా సరికాదని పాకిస్థాన్ హాకీ సమాఖ్య పేర్కొంది. ఇటీవల జరిగిన క్రికెట్ ఏషియా కప్‌లో ఇరు దేశాల ఆటగాళ్ల మధ్య చోటుచేసుకున్న కొన్ని ఘటనలు తమ నిర్ణయంపై ప్రభావం చూపాయని పాకిస్థాన్ హాకీ సమాఖ్య కార్యదర్శి రాణా ముజాహిద్ వెల్లడించారు. ఈ ఏడాది భారత్‌లో జరగాల్సిన హాకీ టోర్నీ నుంచి పాకిస్థాన్ వైదొలగడం ఇది రెండోసారి. అంతకుముందు ఆగస్టు-సెప్టెంబరులో బీహార్‌లో జరిగిన పురుషుల ఆసియా కప్-2025 నుంచి కూడా పాకిస్థాన్ సీనియర్ జట్టు వైదొలగింది. ఈ తాజా పరిణామంతో, భారత్-పాకిస్థాన్‌లు ఒకే పూల్‌లో (గ్రూప్-బి) ఉండగా రద్దు అయ్యింది. కొత్తగా చేరే జట్టును బట్టి గ్రూప్ డైనమిక్స్ మారనున్నాయి.