Kohli-Head Controversy: కోహ్లీ, హెడ్ వివాదం.. ట్రావిస్ హెడ్ భార్యపై ఆన్‌లైన్ వేధింపులు

ట్రావిస్ హెడ్ భార్యపై ఆన్‌లైన్ వేధింపులు

Update: 2026-05-25 11:52 GMT

Kohli-Head Controversy: ఐపీఎల్ 2026 మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ, సన్‌రైజర్స్ హైదరాబాద్ ఓపెనర్ ట్రావిస్ హెడ్‌ల మధ్య మైదానంలో మాటల యుద్ధం జరిగిన సంగతి తెలిసిందే. మ్యాచ్ ముగిసిన తర్వాత విరాట్ కోహ్లీ, ట్రావిస్ హెడ్‌తో షేక్‌హ్యాండ్ ఇచ్చేందుకు ఆసక్తి చూపించలేదు. అయితే, ఈ మైదాన వివాదం కాస్తా ఇప్పుడు సోషల్ మీడియాలో తీవ్ర రూపం దాల్చింది. ఈ నేపథ్యంలో కొందరు భారతీయ క్రికెట్ అభిమానులు ఆన్‌లైన్ వేదికగా తనను, తన కుటుంబాన్ని వేధింపులకు గురిచేస్తున్నారంటూ ట్రావిస్ హెడ్ భార్య జెస్సికా హెడ్ ఆస్ట్రేలియన్ మీడియాతో తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.

జెస్సికా మాట్లాడుతూ.. "గతంలో ఆస్ట్రేలియా వరల్డ్ కప్ గెలిచినప్పుడు ఎలాంటి వేధింపులు ఎదురయ్యాయో.. ఇప్పుడు కూడా అలాంటి పరిస్థితే కనిపిస్తోంది. ఉదయం నేను నిద్ర లేచేసరికి నా సోషల్ మీడియా అకౌంట్స్ అన్నీ నెగెటివ్ కామెంట్లతో హోరెత్తుతున్నాయి. నేను ఎలాగోలా తట్టుకోగలను, కానీ వారు నా స్నేహితులను, కుటుంబ సభ్యులను కూడా వదలకుండా టార్గెట్ చేస్తున్నారు" అని వాపోయారు.

గతంలో 2023 వన్డే ప్రపంచ కప్ ఫైనల్, వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్, 2024 బాక్సింగ్ డే టెస్టుల్లో భారత్‌పై ఆస్ట్రేలియా గెలిచినప్పుడు కూడా ఇలాంటి ఆన్‌లైన్ వేధింపులు జరిగాయని ఆమె గుర్తు చేశారు. అంతకంటే దారుణంగా.. గతంలో తమ చిన్న కుమార్తెను ఉద్దేశించి కూడా ఆందోళన కలిగించేలా బెదిరింపులకు పాల్పడ్డారని ఆమె ఆరోపించారు.

ఈ సందర్భంగా సోషల్ మీడియాలో అభిమానులు ఎలా బాధ్యతాయుతంగా ప్రవర్తించాలో ఆమె కొన్ని ముఖ్యమైన సూచనలు చేశారు. "ప్రస్తుతం అన్ని క్రీడల్లోనూ మానసిక ఆరోగ్యంపై, మనం ఒకరితో ఒకరం మాట్లాడుకునే విధానంపై పెద్ద చర్చే జరుగుతోంది. క్రీడల్లో ఎమోషన్స్ అనేవి చాలా కామన్. కానీ, ఆ ఆట వెనుక నిజమైన వ్యక్తులు, వారి వెనుక కుటుంబాలు ఉన్నాయనే విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తించాలి. ఒకరిపై ఒకరు దయతో ఉండాలి, ఒకరికొకరు మద్దతుగా నిలవాలి" అని జెస్సికా హెడ్ హితవు పలికారు.

Tags:    

Similar News