Krishnamachari Srikkanth: టీమిండియాకు 28 ఏళ్ల నిరీక్షణ తర్వాత వరల్డ్ కప్ అందించిన సంవత్సరం 2011. ఆ మధుర జ్ఞాపకాల్లో ఇప్పటికీ ఒక చేదు నిజం క్రికెట్ అభిమానులను వేధిస్తూనే ఉంటుంది. అదే.. ప్రస్తుత టీమిండియా కెప్టెన్, హిట్ మ్యాన్ రోహిత్ శర్మకు ఆ మెగా టోర్నీలో చోటు దక్కకపోవడం. దీనిపై అప్పటి చీఫ్ సెలెక్టర్ కృష్ణమాచారి శ్రీకాంత్ తాజాగా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు క్రీడా వర్గాల్లో హాట్ టాపిక్ గా మారాయి.

రోహిత్ శర్మను 2011 వరల్డ్ కప్ జట్టు నుంచి తప్పించడం తనను ఇప్పటికీ బాధిస్తోందని శ్రీకాంత్ వెల్లడించారు. ఈ విషయంలో రోహిత్‌కు స్వయంగా క్షమాపణలు కూడా చెప్పానని ఆయన తెలిపారు. ఆనాడు రోహిత్ జట్టులో లేకపోవడానికి కారణం ఫామ్ కాదు, కేవలం జట్టు సమతుల్యత (Team Balance) మాత్రమేనని ఆయన స్పష్టం చేశారు. 1983 వరల్డ్ కప్ గెలిచిన నాటి వ్యూహాన్ని అమలు చేయాలనే ఉద్దేశంతోనే ఆ నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు.

జట్టులో బ్యాటింగ్‌తో పాటు బౌలింగ్ చేయగల ఆల్ రౌండర్ల కోసం వెతుకులాటలో భాగంగానే రోహిత్ లాంటి ప్రతిభావంతుడిని పక్కన పెట్టాల్సి వచ్చిందని శ్రీకాంత్ అన్నారు. ఆ టోర్నీలో యువరాజ్ సింగ్ ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్‌గా నిలవడానికి అతని ఆల్ రౌండ్ ప్రతిభే కారణమని గుర్తు చేశారు. అలాగే సెహ్వాగ్, సచిన్, రైనా, యూసఫ్ పఠాన్ లాంటి వారు బౌలింగ్ ఆప్షన్లుగా ఉండటం వల్ల రోహిత్‌కు చోటు దక్కలేదని, ఇది ఒక రకంగా దురదృష్టకరమని ఆయన అభిప్రాయపడ్డారు.

వాస్తవానికి ఆ వరల్డ్ కప్ ఆడే పూర్తి సామర్థ్యం అప్పట్లోనే రోహిత్‌కు ఉందని శ్రీకాంత్ కొనియాడారు. సెలెక్టర్ల వ్యూహాల వల్ల ఒక గొప్ప ఆటగాడు చిరస్మరణీయ విజయంలో భాగం కాలేకపోవడం పట్ల శ్రీకాంత్ తన మనసులోని బాధను బయటపెట్టారు. ఏదేమైనా, ఆనాడు మిస్సయిన రోహిత్.. ఆ తర్వాత భారత క్రికెట్‌లో తనకంటూ ఒక ప్రత్యేక అధ్యాయాన్ని లిఖించడం విశేషం.

Tags: