Major Shake-Up in Pakistan Cricket: టీ20 ప్రపంచకప్‌లో భాగంగా కొలంబోలోని ప్రేమదాస స్టేడియంలో భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో 61 పరుగుల తేడాతో పాకిస్థాన్ చిత్తుగా ఓడిపోయింది. ఈ ఓటమిని జీర్ణించుకోలేకపోయిన పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (PCB) చైర్మన్ మొహ్సిన్ నఖ్వీ, జట్టులోని సీనియర్ ఆటగాళ్లపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫలితంగా, తదుపరి జరగబోయే నమీబియా మ్యాచ్ నుంచి స్టార్ బ్యాటర్ బాబర్ ఆజం, స్టార్ పేసర్ షాహీన్ షా ఆఫ్రిదీలను జట్టు నుంచి తప్పించాలని మేనేజ్‌మెంట్ నిర్ణయించినట్లు సమాచారం.

పాకిస్థాన్ ఓటమి ఖాయమని తెలియగానే ఆయన మ్యాచ్ ముగియకముందే స్టేడియం వదిలి వెళ్ళిపోయారు. జట్టు మేనేజర్ నవేద్ అక్రమ్ చీమాతో మాట్లాడిన ఆయన, కీలకమైన మ్యాచ్‌ల్లో ఇటువంటి ఆటతీరును ఎంతమాత్రం సహించేది లేదని హెచ్చరించారు. పెద్ద మ్యాచ్‌లలో బాధ్యతాయుతంగా ఆడలేకపోవడంపై ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.

హెడ్ కోచ్ మైక్ హేసన్ కూడా ఆటగాళ్ల తీరుపై అసహనం వ్యక్తం చేశారు. ఆటగాళ్లు తమ పూర్తి సామర్థ్యం మేరకు ఆడలేదని, ప్రణాళికలను అమలు చేయడంలో విఫలమయ్యారని ఆయన డ్రెస్సింగ్ రూమ్‌లో కుండబద్దలు కొట్టారు. ఈ క్రమంలోనే జట్టులో భారీ మార్పులు చేయాలని మేనేజ్‌మెంట్ "థింక్ ట్యాంక్" నిర్ణయించింది.

నమీబియాతో జరగబోయే తదుపరి మ్యాచ్‌లో పాకిస్థాన్ ప్రయోగాలు చేయాలని భావిస్తోంది: ఫామ్ లేమితో ఇబ్బంది పడుతున్న వీరిద్దరినీ బెంచ్‌కే పరిమితం చేయనున్నారు. బాబర్ స్థానంలో ఫఖర్ జమాన్ను, షాహీన్ స్థానంలో సల్మాన్ మీర్జా లేదా నసీమ్ షాను ఆడించే అవకాశం ఉంది. మిడిల్ ఆర్డర్‌ను బలోపేతం చేసేందుకు యువ సంచలనం ఖవాజా నఫాయ్‌కు అవకాశం ఇవ్వాలని చూస్తున్నారు. ఒకవేళ నమీబియాపై ఈ కొత్త కుర్రాళ్లు రాణిస్తే, ఈ ప్రపంచకప్‌లో బాబర్, షాహీన్‌ల ప్రస్థానం ముగిసినట్లేనని విశ్లేషకులు భావిస్తున్నారు.

ప్రస్తుతం పాకిస్థాన్ పాయింట్ల పట్టికలో గందరగోళంలో ఉంది. ఇప్పటికే యూఎస్ఏ, నెదర్లాండ్స్‌పై గెలిచినప్పటికీ, భారత్‌తో జరిగిన భారీ ఓటమి వారి రన్ రేట్‌ను దెబ్బతీసింది. సూపర్-8 దశకు చేరుకోవాలంటే నమీబియాపై గెలవడం పాకిస్థాన్‌కు అనివార్యం.

Tags: