Moises Henriques: ఎస్‌ఆర్‌హెచ్ మాజీ ప్లేయర్ సంచలన నిర్ణయం.. ఆస్ట్రేలియాను వదిలి పోర్చుగల్ జట్టులోకి
పోర్చుగల్ జట్టులోకి
Moises Henriques: ఆస్ట్రేలియా మాజీ ఆల్‌రౌండర్, ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) మాజీ ఆటగాడు మోయిసెస్ హెన్రిక్స్ అంతర్జాతీయ క్రికెట్‌లో ఒక సంచలన నిర్ణయం తీసుకున్నారు. 2028లో ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశాలు సంయుక్తంగా ఆతిథ్యమివ్వనున్న టీ20 ప్రపంచకప్‌ను దృష్టిలో ఉంచుకుని.. తన మాతృభూమి అయిన పోర్చుగల్ దేశం తరఫున ఆడేందుకు ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. పోర్చుగల్ వంటి అసోసియేట్ దేశాన్ని వరల్డ్ కప్‌కు క్వాలిఫై చేయడమే లక్ష్యంగా ఆయన ఈ కీలక అడుగు వేశారు.
పోర్చుగల్‌లో జన్మించిన హెన్రిక్స్.. చిన్నప్పుడే తన కుటుంబంతో కలిసి ఆస్ట్రేలియాకు వలస వెళ్లారు. అయితే, ఇప్పుడు తన పుట్టిన గడ్డకు క్రికెట్‌లో గుర్తింపు తేవాలనే పట్టుదలతో ఉన్నారు. కోడ్ స్పోర్ట్స్ (CODE Sports) నివేదిక ప్రకారం.. రాబోయే ఆగస్టు నెలలో ఫిన్‌లాండ్ వేదికగా జరగనున్న యూరోపియన్ సబ్-రీజినల్ క్వాలిఫైయర్ టోర్నమెంట్‌లో హెన్రిక్స్ పోర్చుగల్ జట్టు తరఫున బరిలోకి దిగనున్నారు. ఈ టోర్నీలో పోర్చుగల్ జట్టు చెక్ రిపబ్లిక్, జర్మనీ, గ్రీస్ మరియు ఇజ్రాయెల్ దేశాలతో తలపడనుంది.
ఈ విషయమై హెన్రిక్స్ మాట్లాడుతూ.. "ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ ఆట మరింత వృద్ధి చెందడానికి ఇదొక మంచి అవకాశం. కేవలం నా పోర్చుగీస్ మూలాలు మాత్రమే కాదు, ప్రపంచవ్యాప్తంగా క్రికెట్‌ను విస్తరించాలనేదే నా ముఖ్య ఉద్దేశం. మరో 10 లేదా 20 దేశాలలో క్రికెట్ నాణ్యతను, ఆసక్తిని మనం పెంచగలిగితే.. భవిష్యత్తులో కేవలం కొన్ని పాశ్చాత్య దేశాలు, ఉపఖండ దేశాలకే పరిమితం కాకుండా, ప్రపంచం మొత్తం ఆగి చూసేలా క్రికెట్ వరల్డ్ కప్‌లను నిర్వహించుకోవచ్చు" అని తన మనసులోని మాటను పంచుకున్నారు.
ప్రస్తుతం 39 ఏళ్ల వయసున్న హెన్రిక్స్.. పోర్చుగల్‌లోని మదీరా ద్వీపం రాజధాని 'ఫుంచాల్' లో జన్మించారు. ప్రపంచ ఫుట్‌బాల్ దిగ్గజం క్రిస్టియానో రొనాల్డో పుట్టిన ఊరు కూడా ఇదే కావడం విశేషం. హెన్రిక్స్ ఆస్ట్రేలియా జాతీయ జట్టు తరఫున 4 టెస్టులతో కలిపి మొత్తం 44 అంతర్జాతీయ మ్యాచ్‌లలో ప్రాతినిధ్యం వహించారు.