Muttiah Muralitharan: ఐపీఎల్ అంటేనే పెద్ద వ్యాపారం.. మురళీధరన్ సంచలన వ్యాఖ్యలు

మురళీధరన్ సంచలన వ్యాఖ్యలు

Update: 2026-05-01 06:41 GMT

Muttiah Muralitharan: ఐపీఎల్ అంటే ఇప్పుడు కేవలం క్రికెట్ మాత్రమే కాదు.. అదొక పరుగుల జాతర. గత ఐదు సీజన్ల నుంచి 200 ప్లస్ స్కోర్లు నమోదు కావడం సర్వసాధారణమైపోయింది. బౌలర్లు ఎన్ని ప్రయోగాలు చేసినా బ్యాటర్ల దూకుడు ముందు బౌండరీల వర్షం కురుస్తూనే ఉంది. ఈ సీజన్‌లోనే 30 సార్లకు పైగా రెండొందల మార్కు దాటడం, 260 పైచిలుకు లక్ష్యాలను కూడా ఛేదించడం చూస్తుంటే.. అసలు బౌలర్లకు రక్షణ ఉందా? అనే ప్రశ్న తలెత్తుతోంది.

దీనిపై సన్‌రైజర్స్ హైదరాబాద్ స్పిన్ బౌలింగ్ కోచ్, దిగ్గజ బౌలర్ ముత్తయ్య మురళీధరన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బౌలర్లు విఫలం కావడానికి వారిని తప్పు పట్టలేమని ఆయన స్పష్టం చేశారు. "పిచ్‌లు పూర్తిగా బ్యాటింగ్‌కే సహకరిస్తున్నాయి. టాప్ ఆర్డర్ బ్యాటర్లు పవర్ ప్లేను ఇష్టారాజ్యంగా వాడుకుంటున్నారు. దీనికి తోడు బౌండరీ సైజులు చిన్నవిగా ఉండటం బౌలర్లకు శాపంగా మారింది" అని మురళీ విశ్లేషించారు.

మరి క్రికెట్ వృద్ధి కంటే కేవలం వినోదం కోసమే ఇలా చేస్తున్నారా? అన్న ప్రశ్నకు మురళీ సూటిగా సమాధానం ఇచ్చారు. "ఐపీఎల్ నిర్మాణం ఇప్పుడు ఒక పెద్ద వ్యాపారంలా మారింది. ఇక్కడ స్పాన్సర్లు, వ్యూయర్స్ ఆసక్తే కీలకం. అభిమానులు ఫోర్లు, సిక్సర్లు చూడాలని కోరుకుంటారు. ఒకవేళ బౌలింగ్‌కు అనుకూలించే పిచ్‌లు తయారు చేస్తే.. మ్యాచ్‌లు లో-స్కోరింగ్‌గా మారి ప్రేక్షకులకు విసుగు తెప్పిస్తాయి. అప్పుడు వ్యూయర్‌షిప్ తగ్గి, స్పాన్సర్లు కూడా దూరమయ్యే ప్రమాదం ఉంది" అని ఆయన బాంబు పేల్చారు.

అంతేకాదు, 'ఇంపాక్ట్ ప్లేయర్' రూల్ వల్ల జట్లకు అదనంగా ఒక బ్యాటర్ అందుబాటులోకి వస్తున్నాడని.. ఇది స్కోరు బోర్డుపై కనీసం 20 పరుగులు పెరగడానికి కారణమవుతోందని మురళీ అభిప్రాయపడ్డారు. క్రికెట్ అభివృద్ధి చెందుతోందా లేదా అన్నది పక్కన పెడితే.. ఆటగాళ్లకు అవకాశాలు, అభిమానులకు వినోదం మాత్రం పుష్కలంగా దొరుకుతున్నాయని ఆయన పేర్కొన్నారు.

Tags:    

Similar News