New Rule in Indian Premier League: ఐపీఎల్ అంటేనే కేవలం మైదానంలో ఆడే 11 మంది ఆటగాళ్లు మాత్రమే కాదు.. డగౌట్‌లో ఉండే కోచ్‌లు, బెంచ్ మీద కూర్చునే సబ్‌స్టిట్యూట్ ప్లేయర్ల సందడి కూడా ఎక్కువే. అయితే ఇకపై ఈ సందడికి బ్రేక్ పడనుంది. ఐపీఎల్‌లో క్రమశిక్షణను పెంచేందుకు మరియు ఆటలో అవాంతరాలను తగ్గించేందుకు బీసీసీఐ ఒక సంచలన నిర్ణయం తీసుకుంది.

సాధారణంగా మ్యాచ్ జరుగుతున్నప్పుడు జట్లలోని ఆటగాళ్లంతా డగౌట్‌లో లేదా బౌండరీ లైన్ దగ్గర కనిపిస్తుంటారు. కానీ బీసీసీఐ తెచ్చిన కొత్త రూల్ ప్రకారం.. ఇకపై టీమ్ షీట్‌లో పేర్కొన్న 16 మంది ఆటగాళ్లకు మాత్రమే గ్రౌండ్‌లోకి ప్రవేశం ఉంటుంది. ఇందులో ఆడుతున్న 11 మందితో పాటు ఐదుగురు సబ్‌స్టిట్యూట్లు మాత్రమే ఉంటారు. మిగతా ప్లేయర్లు డ్రెస్సింగ్ రూమ్‌కే పరిమితం కావాలని బోర్డు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.

ఇంతకుముందు బెంచ్ మీద ఉన్న ఏ ఆటగాడైనా డ్రింక్స్ గానీ, కొత్త బ్యాట్స్ గానీ లేదా కోచ్ పంపే సందేశాలను గానీ తీసుకువచ్చే వీలుండేది. కానీ ఇకపై అలా కుదరదు. ఆ 16 మందిలో లేని ఏ ఆటగాడు కూడా మైదానంలోకి అడుగు పెట్టడానికి వీల్లేదు. ముఖ్యంగా వ్యూహాత్మక విరామాల సమయంలో తప్ప, అనవసరంగా ఆటగాళ్లు మైదానంలోకి రావడం వల్ల సమయం వృధా అవుతోందని బీసీసీఐ భావిస్తోంది.

కేవలం మైదానం లోపలే కాదు, బయట కూడా కొత్త రూల్స్ అమల్లోకి వచ్చాయి. బౌండరీ చుట్టూ ఐదుగురి కంటే ఎక్కువ మంది బెంచ్ ప్లేయర్లు ఉండకూడదు. అంతేకాకుండా, మైదానంలో ఉండే ఎల్‌ఈడీ (LED) యాడ్ బోర్డులు, బౌండరీ లైన్ మధ్యలో ఆటగాళ్లు అటు ఇటు తిరగడాన్ని బీసీసీఐ పూర్తిగా నిషేధించింది. ఇది బ్రాడ్‌కాస్టింగ్‌కు, ఆటగాళ్ల ఏకాగ్రతకు భంగం కలగకుండా తీసుకున్న నిర్ణయంగా కనిపిస్తోంది.

Tags: