Mithali Raj: అప్పట్లో నన్ను హాకీ ప్లేయర్ అనుకునేవారు: మిథాలీ రాజ్
మిథాలీ రాజ్
Mithali Raj: భారత మహిళల క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మిథాలీ రాజ్ తాను క్రికెట్ ఆడటం ప్రారంభించిన తొలి నాళ్ల నాటి చేదు జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. ఒకప్పుడు మహిళల క్రికెట్‌కు గుర్తింపు దక్కడం ఎంత కష్టంగా ఉండేదో ఓ కార్యక్రమంలో ఆమె సుదీర్ఘంగా వివరించారు.
1990ల కాలంలో కిట్ బ్యాగ్ వేసుకుని వెళ్తుంటే.. జనాలు దాన్ని చూసి హాకీ బ్యాగ్ అని పొరబడేవారని మిథాలీ అన్నారు. తనను చూసి అందరూ 'మీరు హాకీ ప్లేయరా?' అని అడిగేవారే తప్ప.. ఒక్కరు కూడా క్రికెటర్ అని ఊహించలేకపోయేవారని ఆమె చెప్పుకొచ్చారు. అప్పట్లో అమ్మాయిలు వీధుల్లో క్రికెట్ ఆడుతూ ఎక్కడా కనిపించేవారు కాదని, మహిళల క్రికెట్ మనుగడ అనేది ఒక నిరంతర పోరాటంలా సాగిందని ఆవేదన వ్యక్తం చేశారు.2007లో మహిళల క్రికెట్ బీసీసీఐ పరిధిలోకి రావడానికి ముందు.. అవకాశాల కోసం, ఆటపై ప్రజల్లో గుర్తింపు తీసుకురావడం కోసం ఎంతో కష్టపడాల్సి వచ్చేదన్నారు. కేవలం వ్యక్తిగత ప్రతిభతోనే అప్పట్లో ప్రజలను ఆకర్షించాల్సి వచ్చేదని మిథాలీ రాజ్ గుర్తు చేసుకున్నారు.
ఇక మరో రెండు రోజుల్లో ప్రతిష్టాత్మక ఐసీసీ వుమెన్స్ టీ20 వరల్డ్ కప్ ప్రారంభం కానున్న నేపథ్యంలో.. ప్రస్తుత హర్మన్ ప్రీత్ కౌర్ సేనకు మిథాలీ రాజ్ పలు కీలక సూచనలు చేశారు. మెగా టోర్నీలో రాణించాలంటే విశాల దృక్పథంతో ఉంటూ, ఎప్పటికప్పుడు నేర్చుకోవడానికి సుముఖత చూపించాలని అన్నారు. మైదానంలో ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉంటూ.. పిచ్, వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా వ్యూహాలు మార్చుకోవాలని టీమిండియాకు సలహా ఇచ్చారు.
ఇక ఈ మెగా సమరంలో భారత మహిళల జట్టు తన తొలి మ్యాచ్‌లోనే చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌తో తలపడనుంది. జూన్ 14న ఎడ్జ్‌బస్టన్ వేదికగా జరగబోయే ఈ హై-వోల్టేజ్ మ్యాచ్ కోసం క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.