PV Sindhu: ఇండోనేషియా ఓపెన్‌లో సింధు శుభారంభం..

సింధు శుభారంభం..

Update: 2026-06-03 04:59 GMT

PV Sindhu: ఇండోనేషియా ఓపెన్ సూపర్ 1000 బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌లో భారత స్టార్ షట్లర్ పీవీ సింధు అద్భుతమైన శుభారంభం చేసింది! మంగళవారం జరిగిన మహిళల సింగిల్స్ మొదటి రౌండ్‌లో సింధు తన అసాధారణ క్లాస్‌ను ప్రదర్శించింది. హోరాహోరీగా సాగిన ఈ మ్యాచ్‌లో 25-–23, 21--–16 తేడాతో థాయిలాండ్ క్రీడాకారిణి బుసానన్‌పై ఘన విజయం సాధించి తదుపరి రౌండ్‌కు దూసుకెళ్లింది. అయితే వచ్చే రౌండ్‌లో సింధుకు అసలైన పరీక్ష ఎదురుకానుంది. అక్కడ ఆమె ప్రపంచ నంబర్ వన్ క్రీడాకారిణి, సౌత్ కొరియా స్టార్ అన్ సే-యంగ్‌తో తలపడే అవకాశం ఉంది.

మరోవైపు, పురుషుల సింగిల్స్‌లో భారత అభిమానులకు తీవ్ర నిరాశే ఎదురైంది. భారత స్టార్ ఆటగాళ్లు తొలి రౌండ్‌లోనే చేతులెత్తేశారు. మాజీ ప్రపంచ నంబర్ వన్ కిదాంబి శ్రీకాంత్ 19-–21, 15–-21 తేడాతో జపాన్‌కు చెందిన యుషి తనకా చేతిలో పరాజయం పాలయ్యాడు. ఇక ఇటీవల మంచి ఫామ్‌లో ఉన్న లక్ష్యసేన్ సైతం 19–-21, 16-–21 తో ఇండోనేషియా ఆటగాడు అల్వి ఫర్హాన్ చేతిలో ఓడిపోయి టోర్నీ నుంచి అనూహ్యంగా వెనుదిరిగాడు. మహిళల సింగిల్స్‌లో మాళవిక బన్సోద్ కూడా ఏడో సీడ్ పోర్న్‌పావీ చేతిలో ఓటమి చవిచూసింది.

సింగిల్స్‌లో నిరాశ ఎదురైనా.. పురుషుల డబుల్స్‌లో మాత్రం భారత్‌కు మంచి విజయం దక్కింది. హరిహరన్ అంసకరుణన్, ఎమ్.ఆర్. అర్జున్ జోడీ అద్భుత ఆటతీరును కనబరిచింది. మలేషియా జంటపై 21-–18, 21–-10 తేడాతో వరుస సెట్లలో విజయం సాధించి రెండో రౌండ్‌లోకి ప్రవేశించింది.కానీ మహిళల డబుల్స్‌లో ట్రీసా జాలీ-గాయత్రి గోపీచంద్ జంట, అలాగే మిక్స్‌డ్ డబుల్స్‌లో ధ్రువ్ కపిల-తనీషా క్రాస్టో జోడీ తొలి రౌండ్‌లోనే ఓడిపోయి టోర్నీ నుంచి నిష్క్రమించారు. మొత్తానికి తొలి రోజు మిశ్రమ ఫలితాలు వచ్చినా.. అందరి కళ్లూ ఇప్పుడు పీవీ సింధుపైనే ఉన్నాయి. మరి తదుపరి రౌండ్‌లో సింధు ఎలాంటి మ్యాజిక్ చేస్తుందో చూడాలి!

Tags:    

Similar News