Japan Open: జపాన్ ఓపెన్‌లో పీవీ సింధు శుభారంభం.. సాత్విక్-చిరాగ్ జోడీకి గాయం షాక్!

సాత్విక్-చిరాగ్ జోడీకి గాయం షాక్!

Update: 2026-07-15 02:21 GMT

Japan Open: టోక్యోలో జరుగుతున్న జపాన్ ఓపెన్ బ్యాడ్మింటన్ సూపర్-750 టోర్నీలో భారత్‌కు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. భారత స్టార్ షట్లర్ పీవీ సింధు ఘనమైన విజయంతో రెండో రౌండ్‌లోకి దూసుకెళ్లగా.. పురుషుల డబుల్స్ స్టార్ జోడీ సాత్విక్ సాయిరాజ్-చిరాగ్ శెట్టికి గాయం రూపంలో భారీ షాక్ తగిలింది.

మహిళల సింగిల్స్ తొలి రౌండ్‌లో ప్రపంచ 10వ ర్యాంకర్ పీవీ సింధు ఆరంభం నుంచే అద్భుత ఆధిపత్యం ప్రదర్శించింది. మలేషియాకు చెందిన వాంగ్ లింగ్ చింగ్‌పై 21-14, 21-11తో వరుస గేమ్స్‌లో అలవోక విజయం సాధించి సెకండ్ రౌండ్‌కు అర్హత సాధించింది. ప్రత్యర్థికి ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా సింధు తన క్లాస్ గేమ్ చూపించింది.

అయితే, పురుషుల డబుల్స్‌లో భారత అభిమానులకు తీవ్ర నిరాశ ఎదురైంది. సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డికి పాత భుజం గాయం మళ్లీ తిరగబెట్టడంతో.. చిరాగ్ శెట్టితో కలిసి తొలి మ్యాచ్ మధ్యలోనే వైదొలిగాడు. డెన్మార్క్ జోడీతో జరిగిన మ్యాచ్‌లో తొలి గేమ్‌ను 19-21తో కోల్పోయిన అనంతరం భారత జోడీ తదుపరి మ్యాచ్‌ను కొనసాగించలేదు. ఈ గాయం కారణంగా వచ్చే వారం జరగబోయే చైనా ఓపెన్‌కు కూడా సాత్విక్-చిరాగ్ జోడీ దూరం కానున్నట్లు భారత డబుల్స్ ప్రధాన కోచ్ టాన్ కిమ్ హెర్ స్పష్టం చేశారు.

ఇక మిక్స్డ్‌ డబుల్స్ విషయానికొస్తే.. భారత్‌కు చెందిన ధృవ్ కపిలా - తనిషా క్రాస్టో జోడీ అద్భుత ప్రదర్శనతో రెండో రౌండ్‌కు చేరుకోగా.. రోహన్ కపూర్ - రుత్విక శివాని గడ్డె జోడీ తొలి రౌండ్‌లోనే పరాజయం పాలై టోర్నీ నుంచి నిష్క్రమించింది.

Tags:    

Similar News