Rohit Sharma: హిట్ మ్యాన్ కు అరుదైన గౌరవం..రాష్ట్రపతి చేతుల మీదుగా పద్మశ్రీ అందుకున్న రోహిత్
రోహిత్
Rohit Sharma: టీమిండియా మాజీ కెప్టెన్, హిట్ మ్యాన్ రోహిత్ శర్మను పురస్కారం వరించింది. మంగళవారం ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో.. భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా రోహిత్ శర్మ ప్రతిష్టాత్మక 'పద్మశ్రీ' అవార్డును అందుకున్నారు. క్రీడా రంగానికి ఆయన చేసిన విశేష సేవలకు గుర్తింపుగా.. 2026 సంవత్సరానికి గాను కేంద్ర ప్రభుత్వం దేశ నాల్గవ అత్యున్నత పౌర పురస్కారమైన పద్మశ్రీతో రోహిత్ శర్మను గౌరవించింది.
నిజానికి మొదటి విడత అవార్డుల ప్రదానోత్సవ సమయంలో కొన్ని కారణాల వల్ల అందుబాటులో లేని రోహిత్ శర్మ.. మంగళవారం జరిగిన ప్రత్యేక వేడుకలో ఈ అవార్డును స్వీకరించారు. రాష్ట్రపతి చేతుల మీదుగా హిట్ మ్యాన్ ఈ పురస్కారాన్ని అందుకుంటున్న విజువల్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. దేశవ్యాప్తంగా ఉన్న క్రీడా ప్రముఖులు, అభిమానులు రోహిత్ శర్మకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
దేశ అత్యున్నత పురస్కారాలైన పద్మ అవార్డులను కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది జనవరి 25న ప్రకటించిన విషయం తెలిసిందే. 2026 సంవత్సరానికి గాను మొత్తం 131 పద్మ అవార్డులను ప్రకటించగా.. అందులో 5 పద్మ విభూషణ్, 13 పద్మ భూషణ్, 113 పద్మశ్రీ అవార్డులు ఉన్నాయి. ప్రజా జీవితం, కళలు, సినిమా, సాహిత్యం, క్రీడలతో పాటు వివిధ రంగాల్లో విశేష ప్రతిభ కనబరిచిన ప్రముఖులకు ఈ పురస్కారాలు దక్కాయి.
ఈ ఏడాది పద్మ అవార్డులలో.. ప్రముఖ సినీ నటుడు ధర్మేంద్ర సింగ్ డియోల్‌కు మరణానంతరం పద్మవిభూషణ్ లభించగా, మలయాళ మెగాస్టార్ మమ్ముట్టిని పద్మభూషణ్ వరించింది. ఇక క్రికెట్ రంగంలో భారత జట్టుకు ఎన్నో అద్భుతమైన విజయాలు అందించి, ప్రపంచకప్‌లలో రికార్డుల వర్షం కురిపించిన మాజీ కెప్టెన్ రోహిత్ శర్మను ఈ 'పద్మశ్రీ' అవార్డు మరింత ఎత్తులో నిలబెట్టింది.