Team India’s T20 Captaincy: టీమిండియా టీ20 కెప్టెన్సీ నుంచి సూర్య అవుట్? బీసీసీఐ సంచలన నిర్ణయం!
బీసీసీఐ సంచలన నిర్ణయం!
Team India’s T20 Captaincy: టీ20 ఫార్మాట్‌లో టీమిండియాను నడిపిస్తున్న మిస్టర్ 360 ప్లేయర్ సూర్యకుమార్ యాదవ్‌పై బీసీసీఐ కఠిన నిర్ణయం తీసుకోబోతోందా? అంటే అవుననే అంటున్నాయి క్రికెట్ బోర్డు వర్గాలు. గత కొంతకాలంగా ఫామ్ లేమితో తీవ్రంగా ఇబ్బంది పడుతున్న సూర్యకుమార్ యాదవ్‌ను.. టీ20 కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పించేందుకు బీసీసీఐ శరవేగంగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది.
గత 18 నెలలుగా సూర్యకుమార్ యాదవ్ బ్యాటింగ్‌లో ఆశించిన స్థాయిలో రాణించలేకపోతున్నాడు. ఇటీవల ముగిసిన ఐపీఎల్‌లోనైనా సూర్య ఫామ్‌లోకి వస్తాడని సెలెక్టర్లు ఆశగా ఎదురుచూశారు. కానీ, అక్కడ కూడా నిరాశాజనక ప్రదర్శనే కొనసాగడంతో బోర్డు సీరియస్‌గా ఉన్నట్లు సమాచారం. రాబోయే యూకే పర్యటనకు ముందే సూర్యను కెప్టెన్సీ నుంచే కాకుండా.. ఆటగాడిగా కూడా జట్టు నుంచి దూరం పెట్టాలని సెలెక్షన్ కమిటీ భావిస్తోందట. టీమిండియా భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఈ కఠిన నిర్ణయం తీసుకోక తప్పడం లేదని బోర్డు వర్గాలు స్పష్టం చేస్తున్నాయి.
అయితే, ఇప్పుడు అందరి దృష్టి "సూర్య స్థానంలో కొత్త కెప్టెన్ ఎవరు?" అనే ప్రశ్నపైనే ఉంది. ప్రస్తుతం ఈ రేసులో ఇద్దరి పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. అందులో మొదటి పేరు శ్రేయస్ అయ్యర్. కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టును ఐపీఎల్ విజేతగా నిలిపిన కెప్టెన్సీ అనుభవం శ్రేయస్‌కు ఉంది. దీంతో సీనియారిటీ పరంగా అతడికే ఎక్కువ అవకాశాలు ఉన్నాయని కొందరు భావిస్తున్నారు.
కానీ, సెలెక్షన్ కమిటీ మాత్రం లాంగ్ టర్మ్ ప్లాన్స్‌తో ముందుకెళ్తోంది. భవిష్యత్తులో సుదీర్ఘకాలం జట్టును నడిపించగల యువ రక్తం కోసం చూస్తోంది. ఈ క్రమంలోనే తెలుగు కుర్రాడు, యువ సంచలనం తిలక్ వర్మ వైపు సెలెక్టర్లు మొగ్గు చూపుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. కెప్టెన్‌గా యువ ఆటగాడికి బాధ్యతలు ఇస్తే బాగుంటుందని బోర్డు భావిస్తోంది.