T20 World Cup 2026: ఉత్కంఠభరిత పోరులో శ్రీలంక నిర్దేశించిన 179 పరుగుల లక్ష్యాన్ని జింబాబ్వే మరో 3 బంతులు మిగిలి ఉండగానే ఛేదించింది. ఆస్ట్రేలియా, ఐర్లాండ్, శ్రీలంక వంటి జట్లు ఉన్న గ్రూప్‌లో అజేయంగా నిలిచి టేబుల్ టాపర్‌గా నిలవడం జింబాబ్వే ఎదుగుదలకు నిదర్శనం.179 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన జింబాబ్వేకు ఓపెనర్లు మంచి పునాది వేశారు. ముఖ్యంగా బ్రియాన్ బెన్నెట్ (63*) ఒకవైపు నిలకడగా ఆడుతుండగా, కెప్టెన్ సికిందర్ రజా (45) విధ్వంసక ఇన్నింగ్స్‌తో లంక బౌలర్లను ముప్పుతిప్పలు పెట్టాడు. ఒక దశలో కండరాలు పట్టేసినా (Cramps) పట్టు వదలకుండా రజా సిక్సర్లతో విరుచుకుపడటంతో రన్ రేట్ అదుపులోకి వచ్చింది. చివరి ఓవర్‌లో 8 పరుగులు అవసరమైన దశలో టోనీ మున్యోంగా భారీ సిక్సర్‌తో విజయాన్ని ఖాయం చేశాడు.

అంతకుముందు బ్యాటింగ్ చేసిన శ్రీలంకకు ఓపెనర్ నిస్సంక (62) మంచి ఆరంభాన్ని ఇచ్చాడు. అయితే మిడిల్ ఓవర్లలో జింబాబ్వే స్పిన్నర్ల ధాటికి లంక బ్యాటర్లు పరుగులు తీయడానికి ఇబ్బంది పడ్డారు. చివర్లో పవన్ రత్నాయకే (44) మెరుపులు మెరిపించడంతో శ్రీలంక 7 వికెట్ల నష్టానికి 178 పరుగులు చేయగలిగింది. ముజరబానీ తన పేస్‌తో లంక బ్యాటర్లను కట్టడి చేయడంలో కీలక పాత్ర పోషించాడు. ఈ అద్భుత విజయంతో జింబాబ్వే ప్రపంచకప్‌లో తాము తక్కువ తినలేదని నిరూపించింది. శ్రీలంక వంటి బలమైన జట్టును ఓడించి గ్రూప్ టాపర్‌గా నిలవడం టోర్నీలోనే అతిపెద్ద మలుపుగా మారింది.

Tags: