Shreyas Iyer Suffers Serious Injury: టీమిండియాకు షాక్.. శ్రేయస్ అయ్యర్‌కు తీవ్రగాయం.. ఆస్పత్రికి తరలింపు..
శ్రేయస్ అయ్యర్‌కు తీవ్రగాయం.. ఆస్పత్రికి తరలింపు..
Shreyas Iyer Suffers Serious Injury: ఆస్ట్రేలియా -భారత్ మూడో వన్డేలో స్టార్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్‌కు ఫీల్డింగ్ చేస్తుండగా గాయం అయ్యింది. గాయం తీవ్రతను తెలుసుకోవడానికి అయ్యర్‌ను వెంటనే మెరుగైన వైద్య పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి తరలించినట్లు బీసీసీఐ ధృవీకరించింది. ఆస్ట్రేలియా ఇన్నింగ్స్‌లో 33వ ఓవర్లో ఈ ఘటన చోటుచేసుకుంది. హర్షిత్ రాణా బౌలింగ్‌లో బ్యాటర్ అలెక్స్ కేరీ కొట్టిన బంతి గాల్లోకి లేవగా, బ్యాక్‌వర్డ్ పాయింట్‌లో ఫీల్డింగ్ చేస్తున్న అయ్యర్ పరిగెత్తుతూ డైవ్ చేసి అద్భుతమైన క్యాచ్ అందుకున్నాడు. అయితే ఈ డైవింగ్ క్రమంలో కిందపడటంతో అతడి ఎడమ పక్కటెముకలకు గాయమైంది. క్యాచ్ పట్టిన వెంటనే అయ్యర్ నొప్పితో విలవిలలాడాడు.
ఆసుపత్రికి తరలింపు:
టీమ్ ఫిజియో కమలేష్ జైన్, సహచర ఆటగాళ్ల సహాయంతో అయ్యర్ మైదానాన్ని వీడాడు. ఆ తర్వాత అతను మళ్లీ ఫీల్డింగ్‌కు రాలేదు. "ఫీల్డింగ్ చేస్తున్న సమయంలో శ్రేయస్ అయ్యర్‌కు ఎడమ పక్కటెముకలకు గాయమైంది. గాయం తీవ్రతను అంచనా వేయడానికి అతడిని ఆసుపత్రికి తరలించాం" అని బీసీసీఐ అధికారిక ప్రకటనలో తెలిపింది.
భవిష్యత్తు సిరీస్‌లపై ప్రభావం:
కీలక సమయంలో అయ్యర్ గాయపడటం టీమిండియాకు ఆందోళన కలిగించే విషయం. రాబోయే నెలల్లో భారత్‌లో దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్‌తో కీలకమైన వన్డే సిరీస్‌లు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో అయ్యర్ త్వరగా కోలుకొని ఫిట్‌నెస్ సాధించడం జట్టుకు కీలకం కానుంది.