Arjuna Award Race: అర్జున అవార్డ్ రేసులో తెలంగాణ క్రీడాకారులు
తెలంగాణ క్రీడాకారులు
Arjuna Award Race: తెలంగాణ క్రీడాకారులు ధనుష్ శ్రీకాంత్ (షూటింగ్), పుల్లెల గాయత్రి (బ్యాడ్మింటన్) ప్రతిష్టాత్మక అర్జున అవార్డు-2025 రేసులో నిలిచారు. జాతీయ క్రీడా అవార్డుల ఎంపిక కమిటీ ప్రకటించిన 24 మంది నామినీల జాబితాలో వీరిద్దరికీ చోటు లభించింది.
1. ధనుష్ శ్రీకాంత్ (డెఫ్ షూటర్)
హైదరాబాద్‌కు చెందిన ధనుష్ శ్రీకాంత్ డెఫ్లింపిక్స్‌లో అద్భుతమైన ప్రతిభ కనబరిచారు. ఇటీవల టోక్యోలో జరిగిన 2025 డెఫ్లింపిక్స్‌లో పురుషుల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ విభాగంలో వరల్డ్ రికార్డు (252.2 పాయింట్లు) సృష్టించి స్వర్ణ పతకం సాధించాడు. ఇతను తెలంగాణ నుంచి ఈ గౌరవం అందుకోబోతున్న కీలక క్రీడాకారుడు.
2. పుల్లెల గాయత్రి (బ్యాడ్మింటన్)
జాతీయ బ్యాడ్మింటన్ చీఫ్ కోచ్ పుల్లెల గోపీచంద్ కుమార్తె అయిన గాయత్రి, డబుల్స్ విభాగంలో రాణిస్తోంది. గాయత్రి , ఆమె భాగస్వామి ట్రీసా జాలీ (కేరళ) ప్రస్తుతం భారతదేశపు నంబర్ వన్ మహిళా డబుల్స్ జోడీగా ఉన్నారు. వీరిద్దరి పేర్లను అర్జున అవార్డుకు కమిటీ సిఫారసు చేసింది. గాయత్రి తండ్రి పుల్లెల గోపీచంద్ , తల్లి పి.వి.వి. లక్ష్మి కూడా ప్రతిష్టాత్మక క్రీడా పురస్కారాలు అందుకున్న వారే.
ప్రతిష్టాత్మక 'మేజర్ ధ్యాన్‌చంద్ ఖేల్ రత్న' అవార్డుకు హాకీ స్టార్ హార్దిక్ సింగ్ పేరు ఏకైక సిఫారసుగా ఉంది. చెస్ ప్లేయర్లు విదిత్ గుజరాతి, దివ్య దేశ్ ముఖ్, అథ్లెట్ తేజస్విన్ శంకర్ వంటి వారు కూడా ఈ జాబితాలో ఉన్నారు.ఈ ఏడాది అర్జున అవార్డు నామినేషన్లలో ఏ ఒక్క క్రికెటర్‌కు చోటు దక్కకపోవడం గమనార్హం.ఈ అవార్డులను త్వరలోనే రాష్ట్రపతి చేతుల మీదుగా అందజేయనున్నారు.