Tragedy in Cricket: క్రికెట్ లో విషాదం: కోహ్లీ మాజీ సహచరుడు కన్నుమూత!

కోహ్లీ మాజీ సహచరుడు కన్నుమూత!

Update: 2026-05-07 07:48 GMT

Tragedy in Cricket: భారత క్రికెట్ ప్రపంచంలో విషాదం నెలకొంది. టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ మాజీ అండర్-19 సహచరుడు, పంజాబ్ మాజీ పేసర్ అమన్‌ప్రీత్ సింగ్ గిల్ (36) బుధవారం చండీగఢ్‌లో కన్నుమూశారు. ఆయన మరణానికి గల ఖచ్చితమైన కారణాలు ఇంకా తెలియరాలేదు. అమన్‌ప్రీత్ మృతి పట్ల క్రికెట్ దిగ్గజం యువరాజ్ సింగ్‌తో పాటు పంజాబ్ క్రికెట్ అసోసియేషన్ (PCA) తీవ్ర సంతాపం వ్యక్తం చేశాయి.

అమన్‌ప్రీత్ సింగ్ కెరీర్ విషయానికి వస్తే, ఆయన పంజాబ్ తరపున ఆరు ఫస్ట్-క్లాస్ మ్యాచ్‌లు ఆడి 11 వికెట్లు తీశారు. 2008లో విరాట్ కోహ్లీ నేతృత్వంలోని అండర్-19 జట్టు ప్రపంచకప్ గెలవడానికి ముందు, 2007లో భారత్ తరపున అండర్-19 వన్డేలు మరియు టెస్టుల్లో ఆయన ప్రాతినిధ్యం వహించారు. ఐపీఎల్ తొలి సీజన్‌లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ (ప్రస్తుతం పంజాబ్ కింగ్స్) జట్టులో సభ్యుడిగా కూడా ఉన్నారు. క్రికెట్ నుండి రిటైర్మెంట్ తీసుకున్న తర్వాత, పంజాబ్ సీనియర్ సెలక్షన్ కమిటీ సభ్యుడిగా సేవలందించారు.

యువరాజ్ సింగ్ తన ఎక్స్ (ట్విట్టర్) వేదికగా స్పందిస్తూ.. "అమన్‌ప్రీత్ మరణవార్త నన్ను తీవ్రంగా కలచివేసింది. కెరీర్ ప్రారంభ రోజుల్లో నేను అతనితో కలిసి డ్రెస్సింగ్ రూమ్‌ను పంచుకున్నాను. అతను చాలా నిశ్శబ్దంగా ఉండేవాడు, ఆట పట్ల ఎంతో మక్కువ కలిగిన కష్టజీవి. అతని కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను" అని భావోద్వేగంగా పోస్ట్ చేశారు. పంజాబ్ కింగ్స్ యాజమాన్యం కూడా తమ మాజీ ఆటగాడికి నివాళులర్పించింది.

Tags:    

Similar News