Turmoil in Pakistan Women’s Cricket Team: పాకిస్థాన్ మహిళా క్రికెట్ జట్టులో తీవ్ర కలహాలు: కెప్టెన్, కోచ్ మధ్య గొడవ
కెప్టెన్, కోచ్ మధ్య గొడవ
Turmoil in Pakistan Women’s Cricket Team: మైదానంలో వరుస ఓటములతో సతమతమవుతున్న పాకిస్థాన్ మహిళా క్రికెట్ జట్టుకు.. ఇప్పుడు ఆఫ్ ది ఫీల్డ్ (డ్రెస్సింగ్ రూమ్) వివాదాలు మరింత తలనొప్పిగా మారాయి. ఇంగ్లాండ్‌లో జరుగుతున్న మహిళల టీ20 ప్రపంచకప్‌లో పాక్ జట్టు ఆటతీరు ఘోరంగా ఉండటమే కాకుండా.. ఆటగాళ్లు, కోచ్‌ల మధ్య తీవ్ర విభేదాలు ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ గొడవలపై పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (PCB) ఇప్పటివరకు అధికారికంగా అవునని కానీ, కాదని కానీ చెప్పనప్పటికీ.. సోషల్ మీడియాతో పాటు ప్రధాన మీడియాలో వస్తున్న కథనాలు జట్టులోని గ్రూపిజం (ముఠా రాజకీయాలు)ను బయటపెడుతున్నాయి. లీడ్స్‌లో మంగళవారం రాత్రి ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో పాకిస్థాన్ వరుసగా నాలుగో ఓటమిని చవిచూసింది. ఈ మెగా టోర్నమెంట్‌కు ముందు ఐర్లాండ్‌లో అడుగుపెట్టినప్పటి నుండి పాక్ జట్టు ఇప్పటివరకు ఒక్క మ్యాచ్ కూడా గెలవలేదు. అంతకంటే ముందు ఐర్లాండ్, వెస్టిండీస్‌లతో ఆడిన త్రైపాక్షిక సిరీస్‌లోనూ కనీసం ఒక్క విజయాన్ని కూడా నమోదు చేయలేకపోయింది. గత ఏడాది ఇండియా, శ్రీలంక వేదికలుగా జరిగిన వన్డే ప్రపంచకప్‌లో కూడా పాక్ జట్టు పాయింట్ల పట్టికలో ఆఖరి స్థానంలో నిలిచింది.
ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం.. జట్టు మెంటార్ మరియు అఫీషియల్ కాని హెడ్ కోచ్ వహాబ్ రియాజ్, కెప్టెన్ ఫాతిమా సనా మధ్య ఆటగాళ్ల ఎంపిక విషయంలో పెద్ద గొడవే జరిగినట్లు తెలుస్తోంది. బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌కు ముందు.. సీనియర్ ప్లేయర్ ఆల్రియా రియాజ్ భర్త (ఆలీ యూనిస్) టీమ్ హోటల్‌లో ఆమె రూమ్‌లోనే స్టే చేయడంపై కెప్టెన్ ఫాతిమా సనా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. సనా పట్టుబట్టడంతో ఆలీ యూనిస్‌ను రూమ్ ఖాళీ చేయాల్సిందిగా కోరారు. ఆ తర్వాత, బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌కు ముందు రోజు జట్టు సభ్యులందరికీ ప్రాక్టీస్ సెషన్ ఉండగా.. ఆల్రియా రియాజ్, ఆమె భర్త ఇద్దరూ కలిసి బయటకు షికార్లకు వెళ్లినట్లు ఒక నివేదిక పేర్కొంది.
ఈ క్రమశిక్షణా ఉల్లంఘనల కారణంగా బంగ్లాదేశ్‌తో ఆడే తుది జట్టు నుండి ఆల్రియా రియాజ్‌ను పక్కన పెట్టాలని కెప్టెన్ సనా డిమాండ్ చేసింది. కానీ మెంటార్ వహాబ్ రియాజ్ మాత్రం ఆమె మాట వినకుండా ఆల్రియాను జట్టులోకి తీసుకున్నాడు. కట్ చేస్తే.. ఆ మ్యాచ్‌లో పాకిస్థాన్ ఓడిపోయింది, ఆల్రియా కూడా ఘోరంగా విఫలమైంది. దాంతో తీవ్ర ఆగ్రహానికి లోనైన కెప్టెన్ సనా.. అందరి ముందే వహాబ్ రియాజ్ మొహం మీదనే "క్రమశిక్షణ నిబంధనలను సరిగ్గా అమలు చేయనందుకే ఈ ఓటమి నమ్రదైంది, దీనికి మీరే పూర్తి బాధ్యత వహించాలి" అని నిలదీసింది.
జట్టులో సీనియర్ ఆటగాళ్లకు, కోచ్‌లకు మధ్య అస్సలు సంబంధాలు సరిగ్గా లేవని.. జట్టులో గ్రూపులు ఏర్పడ్డాయని కథనాలు వస్తున్నాయి. తాము చెప్పిన ప్లాన్స్‌ను ఆటగాళ్లు మైదానంలో అస్సలు అమలు చేయడం లేదని కోచింగ్ స్టాఫ్ తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. పాక్ క్రికెట్‌లో ఇలాంటి డ్రెస్సింగ్ రూమ్ గొడవలు రావడం ఇదే మొదటిసారి కాదు. గతంలో 2023, 2024 ఐసీసీ ప్రపంచకప్‌లలో పాకిస్థాన్ పురుషుల జట్టు విఫలమైనప్పుడు కూడా ఇలాంటి గొడవలే బయటకు వచ్చాయి, ఆ తర్వాత అవి నిజమేనని తేలింది. గత 3-4 ఏళ్లుగా పీసీబీ.. మహిళల జట్టు హెడ్ కోచ్‌లను నిరంతరం మారుస్తూనే ఉంది. మార్క్ కోల్స్ వంటి విదేశీ కోచ్‌లతో పాటు జునైద్ ఖాన్, బాసిత్ అలీ, సలీమ్ జాఫర్, మొహతాషిమ్ రషీద్ వంటి ఎందరో స్థానిక కోచ్‌లను మార్చినప్పటికీ.. పాక్ జట్టు తలరాత మాత్రం మారడం లేదు.