Usman Khawaja: అంతర్జాతీయ క్రికెట్‌కు ఉస్మాన్ ఖవాజా రిటైర్మెంట్
ఉస్మాన్ ఖవాజా రిటైర్మెంట్
Usman Khawaja: ఆస్ట్రేలియా క్రికెట్ చరిత్రలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఉస్మాన్ ఖవాజా, అంతర్జాతీయ టెస్టు క్రికెట్ నుండి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. తన కుటుంబ సభ్యుల సమక్షంలో సిడ్నీ క్రికెట్ గ్రౌండ్ (SCG) వేదికగా ఆయన ఈ నిర్ణయాన్ని వెల్లడించారు. "చాలా కాలంగా దీని గురించి ఆలోచిస్తున్నాను. ఈ సిరీస్ ప్రారంభంలోనే ఇది నా చివరి సిరీస్ కావచ్చనే ఆలోచన మనసులో ఉంది" అని ఖవాజా ఉద్వేగానికి లోనయ్యారు. ఆస్ట్రేలియా తరఫున టెస్టు క్రికెట్ ఆడిన తొలి ముస్లిం ఆటగాడిగా రికార్డు సృష్టించిన ఖవాజా, ఇప్పటివరకు 87 టెస్టుల్లో 6,206 పరుగులు సాధించారు. ఆయన కెరీర్‌లో 16 సెంచరీలు, 28 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. టెస్టుల్లో ఆయన అత్యధిక వ్యక్తిగత స్కోరు 232 పరుగులు కాగా, సగటు 43.39గా ఉంది. 2027లో జరగబోయే భారత పర్యటన వరకు ఖవాజా కొనసాగాలని ఆస్ట్రేలియా హెడ్ కోచ్ ఆండ్రూ మెక్‌డొనాల్డ్ కోరినట్లు ఆయన వెల్లడించారు. అయితే, సరైన సమయంలో గౌరవంగా తప్పుకోవడమే మంచిదని తాను భావించినట్లు ఖవాజా తెలిపారు. "అడిలైడ్ టెస్టుకు మొదట నన్ను ఎంపిక చేయకపోవడమే నేను తప్పుకోవడానికి సరైన సంకేతం అని భావించాను. నా సొంత నిబంధనల ప్రకారం, నాకు ఇష్టమైన సిడ్నీ మైదానంలో రిటైర్మెంట్ ప్రకటించడం సంతోషంగా ఉంది" అని ఆయన పేర్కొన్నారు. తాను రిటైర్మెంట్ ప్రకటించకుండా జట్టులో కొనసాగుతుండటంపై వచ్చిన 'స్వార్థపూరిత' ఆరోపణలను ఖవాజా కొట్టిపారేశారు. "నేను నా కోసం జట్టులో కొనసాగలేదు. శ్రీలంక సిరీస్ మరియు వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (WTC) కోసం నా అవసరం ఉందని కోచ్ కోరడం వల్లే ఆడాను. నేను ఎప్పుడూ స్వార్థంతో ఆలోచించలేదు" అని విమర్శకులకు ఘాటుగా సమాధానం ఇచ్చారు. ఖవాజా వీడ్కోలు నిర్ణయంపై క్రికెట్ ఆస్ట్రేలియా సీఈఓ టాడ్ గ్రీన్‌బర్గ్ స్పందిస్తూ.. ఆసీస్ క్రికెట్‌కు ఆయన అందించిన సేవలు వెలకట్టలేనివని కొనియాడారు. 39 ఏళ్ల ఈ స్టార్ బ్యాటర్ నిష్క్రమణతో ఆస్ట్రేలియా టెస్టు జట్టులో ఒక శకం ముగిసినట్లయింది.