IPL 2026: ఐపీఎల్ 2026లో వైభవ్ సూర్యవంశీ సరికొత్త రికార్డు
వైభవ్ సూర్యవంశీ సరికొత్త రికార్డు
IPL 2026: ఐపీఎల్ 2026లో రాజస్థాన్ రాయల్స్ యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ సరికొత్త చరిత్ర సృష్టించాడు. ఈ సీజన్‌లో నిలకడగా రాణిస్తూ, అద్భుతమైన పవర్ హిట్టింగ్‌తో దూసుకుపోతున్న వైభవ్, 400 పరుగుల మైలురాయిని అందుకున్న తొలి ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు. ఇప్పటివరకు ఆడిన తొమ్మిది ఇన్నింగ్స్‌ల్లో ఒక సెంచరీ, రెండు హాఫ్ సెంచరీలతో కలిపి మొత్తం 400 పరుగులు చేశాడు. అతని బ్యాటింగ్ సగటు 44.44గా ఉంటే, స్ట్రైక్ రేట్ ఏకంగా 238.09గా ఉండటం విశేషం.
మంగళవారం పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో వైభవ్ కేవలం 16 బంతుల్లోనే 5 పరుగులతో కలిపి 43 పరుగులు చేసి రాజస్థాన్‌కు మెరుపు ఆరంభాన్ని ఇచ్చాడు. ఈ క్రమంలోనే మాజీ క్రికెటర్ మోహిత్ శర్మ, వైభవ్‌ను దిగ్గజ ఆటగాడు ఎం.ఎస్. ధోనీతో పోల్చారు. గ్రౌండ్ ఏదైనా, ఫ్రాంచైజీ ఏదైనా ధోనీకి ఎలాంటి ఆదరణ, గౌరవం లభిస్తాయో, ప్రస్తుతం వైభవ్ విషయంలోనూ అదే కనిపిస్తోందని మోహిత్ కొనియాడారు. ప్రత్యర్థి జట్ల ఆటగాళ్లు, కెమెరామెన్లు, కామెంటేటర్లు ఇలా ప్రతి ఒక్కరూ వైభవ్‌తో మాట్లాడటానికి ఆసక్తి చూపిస్తున్నారని, ధోనీ తర్వాత అంతటి ప్రభావాన్ని తాను వైభవ్‌లోనే చూస్తున్నానని ఆయన పేర్కొన్నారు.
ఈ మ్యాచ్ విషయానికి వస్తే, 223 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్థాన్ రాయల్స్ 6 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. వైభవ్ ఇచ్చిన ఊపును యశస్వి జైస్వాల్ (51) కొనసాగించగా, చివర్లో డోనోవన్ ఫెరీరా (52 నాటౌట్), శుభమ్ దూబే (31 నాటౌట్) ఆకాశమే హద్దుగా చెలరేగి మరో నాలుగు బంతులు మిగిలి ఉండగానే విజయాన్ని అందించారు. పంజాబ్ బౌలర్లలో చాహల్ 3 వికెట్లతో రాణించినప్పటికీ, అర్ష్‌దీప్ సింగ్, ఫెర్గూసన్ వంటి బౌలర్లు భారీగా పరుగులు సమర్పించుకోవడంతో పంజాబ్‌కు ఈ సీజన్‌లో తొలి ఓటమి తప్పలేదు. అంతకుముందు పంజాబ్ తరపున స్టోయినిస్ 20 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేయడంతో ఆ జట్టు 222 పరుగులు చేసింది.