Vijay Hazare Trophy: ప్రపంచ రికార్డు సృష్టించిన కేరళ స్పిన్నర్
కేరళ స్పిన్నర్
Vijay Hazare Trophy: విజయ్ హజారే ట్రోఫీలో కేరళ యువ స్పిన్నర్ విఘ్నేష్ పుత్తూరు ప్రపంచ రికార్డును తిరగరాశారు. బుధవారం (డిసెంబర్ 24) త్రిపురతో జరిగిన ఎలైట్ గ్రూప్-ఎ మ్యాచ్‌లో 24 ఏళ్ల విఘ్నేష్ ఏకంగా 6 క్యాచ్‌లు అందుకొని, లిస్ట్-ఏ క్రికెట్ చరిత్రలో ఒకే మ్యాచ్‌లో అత్యధిక క్యాచ్‌లు పట్టిన తొలి ఫీల్డర్ (వికెట్ కీపర్ కాకుండా)గా చరిత్ర సృష్టించారు. కేరళలోని మలప్పురానికి చెందిన ఈ యువ ఆటగాడు తన అరంగేట్రం (డెబ్యూ) మ్యాచ్‌లోనే ఈ అద్భుత ఘనత సాధించడం విశేషం.
ఈ మ్యాచ్‌లో కేరళ జట్టు 145 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. ఇటీవల అబుదాబిలో జరిగిన ఐపీఎల్ 2026 వేలంలో రాజస్థాన్ రాయల్స్ జట్టు రూ. 30 లక్షలకు విఘ్నేష్‌ను సొంతం చేసుకుంది. గతంలో ముంబై ఇండియన్స్ జట్టులో సభ్యుడిగా ఉన్న ఆయన, ఇప్పుడు మైదానంలో తన అద్భుత ఫీల్డింగ్ విన్యాసాలతో అందరి దృష్టిని ఆకర్షించారు.
జోంటీ రోడ్స్ 32 ఏళ్ల రికార్డు కనుమరుగు: లిస్ట్-ఏ క్రికెట్‌లో ఇప్పటివరకు ఒక మ్యాచ్‌లో అత్యధికంగా 5 క్యాచ్‌లు పట్టిన రికార్డు దక్షిణాఫ్రికా దిగ్గజ ఫీల్డర్ జోంటీ రోడ్స్ పేరిట ఉండేది. 1993లో వెస్టిండీస్‌పై జోంటీ ఈ ఘనత సాధించారు. ఆ తర్వాత ఇంగ్లాండ్ ప్లేయర్ హ్యారీ బ్రూక్ (2025 మే), మేఘాలయకు చెందిన అరియన్ సంగ్మా (2025 జనవరి) కూడా 5 క్యాచ్‌లు పట్టారు. అయితే, ఇప్పుడు విఘ్నేష్ ఏకంగా 6 క్యాచ్‌లు అందుకొని వారందరినీ వెనక్కి నెట్టారు.
మ్యాచ్‌లో విఘ్నేష్ మెరుపులు: త్రిపుర ఇన్నింగ్స్ 11వ ఓవర్‌లో ఓపెనర్ ఉదియన్ బోస్‌ను తన సొంత బౌలింగ్‌లో 'కాట్ అండ్ బౌల్డ్' చేయడం ద్వారా విఘ్నేష్ తన క్యాచ్‌ల పర్వాన్ని మొదలుపెట్టారు. ఆ తర్వాత కేవలం ఏడు ఓవర్ల వ్యవధిలోనే వరుసగా ఐదు క్యాచ్‌లు పట్టి మ్యాచ్‌ను మలుపు తిప్పారు. బాబా అపరాజిత్ బౌలింగ్‌లో స్వప్నిల్ సింగ్, సౌరభ్ దాస్, అభిజిత్ సర్కార్, విక్కీ సాహాల క్యాచ్‌లు పట్టగా.. అంకిత్ కుమార్ బౌలింగ్‌లో శ్రీధమ్ పాల్ క్యాచ్‌ను విఘ్నేష్ అందుకున్నారు. బ్యాటింగ్‌లో అవకాశం రాకపోయినా, ఫీల్డింగ్‌తోనే ప్రపంచ స్థాయి రికార్డు నెలకొల్పి వార్తల్లో నిలిచారు.