Vijay Hazare Trophy: విజయ్ హజారే ట్రోఫీ: కోహ్లీ మెరుపు ఇన్నింగ్స్

కోహ్లీ మెరుపు ఇన్నింగ్స్

Update: 2025-12-26 06:56 GMT

Vijay Hazare Trophy: కోహ్లీ తన ఇన్నింగ్స్‌ను అత్యంత దూకుడుగా ఆరంభించాడు. కేవలం 29 బంతుల్లోనే అర్ధసెంచరీ పూర్తి చేసి మైదానంలో ఉన్న వారందరినీ అలరించాడు. అయితే రెండో ఎండ్‌లో వికెట్లు పడుతుండటంతో ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే క్రమంలో కాస్త నెమ్మదించిన కోహ్లీ, చివరకు సీటీ గజా బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు. తన ఇన్నింగ్స్‌లో మొత్తం 13 ఫోర్లు, ఒక సిక్సర్ బాదాడు.

మరోవైపు ముంబై కెప్టెన్ రోహిత్ శర్మకు ఈరోజు చేదు అనుభవం ఎదురైంది. సిక్కింపై జరిగిన గత మ్యాచ్‌లో 155 (94) పరుగులతో విరుచుకుపడిన రోహిత్, ఉత్తరాఖండ్‌తో జరిగిన రెండో మ్యాచ్‌లో 'గోల్డెన్ డక్' (సున్నా) గా వెనుదిరిగాడు. ఇన్నింగ్స్ తొలి ఓవర్లోనే ఉత్తరాఖండ్ బౌలర్ దేవేంద్ర సింగ్ బోరా వేసిన బంతిని పుల్ షాట్ ఆడే ప్రయత్నంలో రోహిత్ విఫలమయ్యాడు. ఫైన్ లెగ్‌లో ఉన్న జగ్‌మోహన్ నాగర్‌కోటికి నేరుగా క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. దీంతో ముంబై భారీ షాక్‌కు గురైంది.

వచ్చే నెలలో న్యూజిలాండ్‌తో జరిగే వన్డే సిరీస్‌కు ముందు వీరిద్దరూ మ్యాచ్ ప్రాక్టీస్ కోసం విజయ్ హజారే ట్రోఫీలో బరిలోకి దిగారు. కోహ్లీ అద్భుతమైన ఫామ్‌లో ఉండటం భారత జట్టుకు సానుకూల అంశం కాగా, రోహిత్ శర్మ ఒక ఇన్నింగ్స్‌లో భారీ సెంచరీ, మరో ఇన్నింగ్స్‌లో డకౌట్ అవ్వడం విశేషం. ఏదేమైనా ఈ ఇద్దరు దిగ్గజాలు దేశవాళీ క్రికెట్‌లో ఆడటం ఈ టోర్నీకి కొత్త గ్లామర్‌ను తెచ్చింది.

Tags:    

Similar News